TTD SPEEDS UP BRAHMOTSAVAM ARRANGEMENTS _ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమలగిరులు
2013 శ్రీవారి బ్రహ్మోత్సవ ప్రత్యేకం – 1
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమలగిరులు
తిరుమల, సెప్టెంబరు 07, 2013: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసియున్న తిరుమల దివ్యక్షేత్రంలో నిత్యకల్యాణం పచ్చతోరణం, అనుదినం ఒక ఉత్సవమే. శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఏడాది పొడవునా 450కి పైగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు వివిధ పురాణాలు తెలుపుతున్నాయి. అయితే అన్ని ఉత్సవాల్లోకెల్లా అలంకారప్రియునికి అత్యంత ప్రియమైన ఉత్సవం బ్రహ్మోత్సవం విశేషం. సాక్షాత్తు బ్రహ్మదేవుడే శ్రీవారికి బ్రహ్మోత్సవాలను నవాహ్నికంగా నిర్వహించినట్టు పురాణాలు ఘోషిస్తున్నాయి.
విజయనామ సంవత్సరం అక్టోబరు నెల 5 నుండి 13వ తారీఖు వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మహోత్సవంగా నిర్వహించడానికి తితిదే సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ విభాగాలు తమ తమ పరిధిలోని పనులను రాజీకి తావులేకుండా అద్భుతమైన ఏర్పాట్లను చేస్తున్నవి. కలియుగ వైకుంఠంగా పిలువబడే తిరుమల దివ్యక్షేత్రాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
దర్శనం :
1. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేయడమైనది.
2. ఉదయం, రాత్రి వాహనసేవల సమయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం మూలవిరాట్టు దర్శనంతో సమానమని పురాణభాష్యం.
3. వాహనాలపై స్వామివారిని ఊరేగించే సమయాల్లో భక్తులు దయచేసి నాణేలు విసరవద్దని మనవి.
4. గరుడ సేవ నాడు తిరుమలకు ద్విచక్రవాహనాలు నిషేధించడమైనది.
భద్రత :
1. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తితిదే నిఘా మరియు భద్రతా విభాగం, పోలీసు విభాగం సంయుక్తంగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి.
2. చంటిపిల్లల భక్తులు జాగురూకతతో వ్యవహరించాలని మనవి.
3. మహిళా భక్తులు బంగారునగలు, విలువైన వస్తువులు తీసుకురాకూడదని విజ్ఞప్తి.
ఇంజినీరింగ్ విభాగము :
సివిల్ ఇంజినీరింగ్ :
1. భక్తుల సౌకర్యార్థం ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు, చలువపందిళ్ల ఏర్పాటు, రోడ్లు నిర్మాణం, కాటేజీల్లో వసతులు మెరుగుపర్చడం లాంటి పనులను పూర్తి చేశారు.
2. దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో రంగవళ్లులు, చెక్కపనులు, పెయింటింగ్ తదితర పనులు చేపడుతున్నారు.
విద్యుత్ విభాగము:
1. తిరుమల శ్రీవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించడం, వివిధ పౌరాణిక పాత్రల ఆధారంగా ఆకర్షణీయంగా విద్యుద్దీపాలతో కటౌట్లు ఏర్పాట్లు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
నీటిపారుదల విభాగం :
1. శ్రీవారి పుష్కరిణికి ఆగస్టు 14 నుండి సెప్టెంబరు 16వ తేదీ వరకు మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
2. పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి కొత్త నీటితో నింపుతారు.
ఉద్యానవన విభాగము :
1. కోల్‌కతా, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు చెందిన నిపుణులు తిరుమల శ్రీవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించడం, ఫలపుష్ప ప్రదర్శన, వివిధ దేవతారూపాల ప్రదర్శన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వసతి :
1. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే అశేష భక్తజనానికి అవసరమైన విడిది సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగింది.
2. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, సత్రాలలో వసతిని పొందవచ్చు.
కల్యాణకట్ట :
1. భక్తుల రద్దీ దృష్ట్యా కక్షురకులు అందుబాటులో ఉండేవిధంగా ప్రస్తుతం ఉన్న సిబ్బందితో పాటు శ్రీవారి కల్యాణకట్ట సేవకులతో భక్తులకు ఉచితంగా తలనీలాలు తీసే సౌకర్యాన్ని తితిదే ఏర్పాటుచేసింది.
ఆరోగ్యశాఖ :
1. ఆలయ నాలుగు మాడవీధులను పరిశుభ్రంగా ఉంచడం, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం అదనపు సిబ్బందిని నియమించింది.
అన్నప్రసాద వితరణ :
1. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ గెస్ట్‌హౌస్, కంపార్ట్మెంట్లు, క్యూలైన్లు, కాలిబాట మార్గాల్లో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు.
వైద్యశాఖ :
1. తిరుమలలోని అశ్వని ఆసుపత్రి, వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని వైద్యశాలల్లో అదనపు సిబ్బందిని నియమించారు.
2. తగినన్ని మందులను సిద్ధం చేసుకున్నారు.
3. తిరుమలలోని ప్రధాన కూడళ్లలో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ప్రజాసంబంధాలు :
1. తిరుమలలో మీడియా సెంటర్ ఏర్పాటుచేసి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి కంప్యూటర్లు, ఇంటర్నెట్ వసతి కల్పిస్తోంది.
2. నాడు – నేడు శీర్షికన ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనుంది.
3. దాదాపు 5 వేల మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు అవసరమైన సేవలందిస్తారు.
రవాణా శాఖ :
1. ఆర్టిసి అధికారులతో సమన్వయం చేసుకుని తిరుమలకు వచ్చే యాత్రికులకు తగినన్ని బస్సులు అందుబాటులో ఉంచుతారు.
2. తిరుమలలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి భక్తులను చేరవేసేందుకు అవసరమైనన్ని ఉచిత బస్సులను ఏర్పాటుచేశారు.
హిందూ ధర్మప్రచార పరిషత్ :
1. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహనసేవల ముందు తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ద్వారా భజనలు, కోలాటాలు, వివిధ రాష్ట్రాల కళాకారులతో వాయిద్య విన్యాసాలు ఏర్పాటుచేస్తారు. తిరుమలలో ఆస్థానమండపం, నాదనీరాజనం వేదిక, తిరుపతిలో మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో ఆధ్యాత్మిక, ధార్మిక ఉపన్యాసాలు, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.
2. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ వాహన వైభవాన్ని, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది