TTD TO ORGANISE “MANAGUDI” EVERY YEAR-TTD EO _ ఇకపై ప్రతి ఏడాదీ ‘మనగుడి’ : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
ఇకపై ప్రతి ఏడాదీ ‘మనగుడి’ : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుపతి, 2012 ఆగస్టు 17: శ్రీ వేంకటేశ్వరస్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణం, శ్రావణపౌర్ణమి పర్వదినాలను పురస్కరించుకుని ఆగస్టు 2వ తేదీన తితిదే దేవాదాయ శాఖతో కలసి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మనగుడి కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో శుక్రవారం సాయంత్రం ఆయన మనగుడి కార్యక్రమంపై అన్ని విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ మనగుడి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా గల భక్తుల నుండి విశేష స్పందన రావడం సంతోషకరమన్నారు. ఆలయాల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తుల మన్ననలు పొందవచ్చని అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో జరుగనున్న ఇలాంటి కార్యక్రమాల్లో ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. అనంతరం ఈ సంవత్సరం మనగుడి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులతో మాట్లాడి కార్యక్రమం తీరుతెన్నులను విశ్లేషించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌లో మనగుడి కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా డాక్యుమెంటరీ చేసి విడుదల చేయాలని ఈవో సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.