TTD TO PURCHASE ORGANIC PRODUCTS FOR ITS NEED, SAYS TTD CHAIRMAN _ టిటిడి అవసరాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులనే కొనుగోలు చేస్తాం
Tirupati, 31 Oct. 21: TTD chairman Sri YV Subba Reddy said on Sundaythat TTD would purchase only organic products from organic farmers for all of its needs of rice, pulses, and jaggery henceforth.
TTD board members Sri Ashok Kumar, Sri Chevireddy Bhaskar Reddy, Sri Maruti Prasad, Sri Ramulu Sri Melind Nareswae, Sri Bora Saurab, Yuga Tulasi Foundation chairman Sri Shiv Kumar, TTD JEOs Smt Sada Bhargavi, and Sri Veerabrahmabm CVSO Sri Gopinath Jatti were present.
టిటిడి అవసరాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులనే కొనుగోలు చేస్తాం
– తెలుగు రాష్ట్రాల్లోని గోశాలలను ఆర్థికంగా ఆదుకుంటాం
– ప్రతి జిల్లాలో గోమహాసమ్మేళనాలు నిర్వహిస్తాం
జాతీయ గో మహాసమ్మేళనం ముగింపు సభలో టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి
తిరుపతి, 2021 అక్టోబరు 31: టిటిడి అవసరాలకు ఉపయోగిస్తున్న బియ్యం, బెల్లం, పసుపు లాంటి ముడిసరుకులన్నీ రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయంతో పండించిన రైతుల నుంచే కొనుగోలు చేస్తామని టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు.
గోమాతను రక్షిస్తూ, సేవిస్తూ తద్వారా భూమాతను కాపాడితే ప్రపంచం సుభిక్షంగా ఉంటుందని, మానవాళి మొత్తం ఆరోగ్యంగా ఉంటారని సమాజానికి మరోసారి తెలియజెప్పడానికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదేశంతోనే ఆయన పాదాల చెంత ఉన్న మహతి ఆడిటోరియంలో ఈ రెండు రోజుల జాతీయ గోమహాసమ్మేళనం నిర్వహించినట్టు టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. గోసంరక్షణ కోసం టిటిడి రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనుందని, తెలుగు రాష్ట్రాల్లోని గోశాలలను శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలతో అనుసంధానం చేసి గోవుల పోషణకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. గుడికో గోమాత కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మరింత ఉదృతంగా నిర్వహిస్తామని, ఇందుకు మఠాధిపతులు, పీఠాధిపతులు, వేదపాఠశాలల నిర్వాహకులు తమవంతు సహకారం అందించాలని అభ్యర్థించారు. టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ గోమహాసమ్మేళనం ఆదివారం ముగిసింది.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పేరొందిన సనాతన హిందూ ధర్మానికి మూలస్తంభాలైన అనేకమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు హాజరై దివ్య అనుగ్రహభాషణం చేయడం మనందరి అదృష్టమని చెప్పారు. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లేనని మనసా వాచా కర్మణ మనమందరం నమ్ముతున్నామన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్మోహన్రెడ్డి కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవారేనన్నారు. వారి తండ్రి దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయాన్ని, గోవులను ఎంతగా ప్రేమించేవారో అందరికీ తెలుసన్నారు. అందుకే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్మోహన్రెడ్డి రైతు సంక్షేమానికి, ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రైతు బాగుంటే సమాజం బాగుంటుందని, రైతు సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మేవారిలో ముఖ్యమంత్రి కూడా ఒకరని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగం ఏర్పాటు చేయించినట్టు చెప్పారు. గోపరిరక్షణకు, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి టిటిడి చేపట్టిన కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారని ఛైర్మన్ వివరించారు.
రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పండించిన ఉత్పత్తుల్లో పౌష్టిక విలువలు 60 నుండి 70 శాతం మేరకు, కొన్ని ఉత్పత్తుల్లో 100 శాతం కూడా తగ్గినట్టు పరిశోధనల్లో తేలిందన్నారు. ఈ ఉత్పత్తులు తినడం వల్ల చిన్నపిల్లల్లో మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రసాయనిక ఎరువుల వ్యవసాయం వల్ల రాబోయే 20 ఏళ్లలో ఎదురయ్యే అతిపెద్ద ప్రకృతి, జీవవైవిధ్య విధ్వంసం మానవాళిని ఎలా నాశనం చేస్తుందనే విషయాలను ఐక్యరాజ్యసమితి హెచ్చరించిందన్నారు. ప్రకృతికి హాని చేయకుండా ప్రకృతితో మమేకమై చేసే వ్యవసాయంతోనే ఈ సమస్య నుంచి ప్రపంచం బయటపడుతుందన్నారు. ప్రకృతికి, ప్రపంచమానవాళికి చాపకింద నీరులా జరుగుతున్న ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే టిటిడి గోమహాసమ్మేళనం నిర్వహణకు పూనుకుందన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఎపి రైతు సాధికారిక సంస్థతో ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి దశగా వైఎస్ఆర్ కడప, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని రైతులతో రసాయన ఎరువులు ఉపయోగించకుండా కేవలం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో శనగ పంట సాగు చేయించి వారికి గిట్టుబాటు ధర కల్పించి టిటిడి సేకరిస్తుందని తెలిపారు. తమ ప్రయత్నానికి శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులు లభించి ప్రపంచం ఎదుర్కొంటున్న రసాయనిక అవశేషాల ఆహారం నుంచి బయటపడడానికి టిటిడి మార్గదర్శకంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గోసంరక్షణతోపాటు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం దిశగా రైతాంగాన్ని సంసిద్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గోశాలల అభివృద్ధికి కార్యాచరణ : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 600కు పైగా ఉన్న గోశాలలను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామని తెలియజేశారు. త్వరలో గోశాలల నిర్వాహకులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో 3 లక్షల ఎకరాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. టిటిడికి ఏటా అవసరమయ్యే 6 వేల టన్నుల బియ్యం, 7 వేల టన్నుల శనగపప్పు, 6 వేల టన్నుల ఆవునెయ్యి, ఇతర ముడిపదార్థాలు వీరి నుంచే కొనుగోలు చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతోనే ఇప్పటికే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నామని తెలిపారు.
ప్రకృతిని పరిరక్షించడంలో భాగంగా తిరుమల అటవీ ప్రాంతంలోని 800 హెక్టార్లలో ఉన్న ఆస్ట్రేలియా తుమ్మ చెట్లను తొలగించే కార్యక్రమం ప్రారంభించామన్నారు. వీటి స్థానంలో రావి, మర్రి, నేరేడు, సంపంగి లాంటి స్వదేశీ మొక్కలు పెంచుతామన్నారు. రెండేళ్ల కాలంలో టిటిడి చేపట్టిన టిటిడి ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో అగరబత్తులు, దేవతామూర్తుల చిత్రపటాల తయారీ, శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి, అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం తదితర కార్యక్రమాలను వీడియో క్లిప్పింగుల ద్వారా వివరించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగపడేందుకు పాలివ్వని ఆవులతోపాటు ఎద్దులను ఉచితంగా అందిస్తామన్నారు.
గో ఆధారిత వ్యవసాయమే ప్రపంచానికి దిక్కు : శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి
తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి పాదాల చెంత నిర్వహించిన గోమహాసమ్మేళనం గోఆధారిత వ్యవసాయమే ప్రపంచానికి దిక్కు అని తీర్మానం చేసి ఐక్యరాజ్యసమితికి పంపాలని కోరారు. ప్రపంచీకరణ నుండి పుట్టిన వికృత శిశువైన రసాయ ఎరువుల వ్యవసాయం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో టిటిడి తలపెట్టిన గో సంరక్షణ తలంపు కొత్త విప్లవానికి నాంది అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 50 సంవత్సరాలుగా వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం ఎక్కువైందని, దీనివల్లే ప్రపంచం ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పారు. గోమాతకు జరుగుతున్న అపకారాన్ని గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఎదుర్కొనేందుకు, హిందూ ధార్మికతను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి టిటిడి చేపట్టిన ఈ కార్యక్రమం ప్రపంచం మొత్తానికి అనుసరణీయమని, ఇది పాటించకపోతే మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని శ్రీ కరుణాకర్‌రెడ్డి చెప్పారు.
గోమాత విశిష్టతను తెలియజేస్తూ ప్రముఖ సినీ పాటల రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన గీతాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. సినీ సంగీత దర్శకురాలు శ్రీమతి ఎం ఎం శ్రీలేఖ సంగీతం అందించగా, సినీ దర్శకులు శ్రీ శ్రీనివాస రెడ్డి ఈ గీతాన్ని రూపొందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్‌కుమార్, శ్రీ మారుతి ప్రసాద్, శ్రీ మొరంశెట్టి రాములు, శ్రీ మిలింద్ నర్వేకర్ , శ్రీ బోరా సౌరభ్ , యుగతులసి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివకుమార్, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మయ్య, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.