TTD TO SELL SADHU SUBRAHMANYA SASTRY’S EPIGRAPHICAL WORK ON 50% DISCOUNT _ తితిదే పుస్తక భాండాగారంలో శ్రీవారి శాసనాల గ్రంథరాజం
తితిదే పుస్తక భాండాగారంలో శ్రీవారి శాసనాల గ్రంథరాజం
తిరుపతి, ఆగస్టు 11, 2013: శ్రీవారి ఆలయ చరిత్రను కళ్లకు కట్టేలా పలువురు రాజులు వేయించిన శాసనాల సమగ్ర సమాచారం ఎనిమిది సంపుటాల్లో తితిదే పుస్తక భాండాగారంలో పాఠక భక్తులకు అందుబాటులో ఉంది. తితిదేలో పురావస్తు శాస్త్రవేత్తగా పనిచేసిన శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి, శాసన అధ్యయనకారుడిగా పనిచేసిన శ్రీ విజయ రాఘవాచార్య ఈ గ్రంథాలను ఆంగ్లంలో రచించారు. వీటిని శ్రీ ఎం.ఆర్.కె.వినాయక్ తితిదే కార్యనిర్వహణాధికారిగా ఉన్న సమయంలో మొదటిసారిగా ముద్రించారు. ఈ ఎనిమిది పుస్తకాల సెట్ ధర రూ.990/- కాగా తితిదే 50 శాతం రాయితీపై రూ.495/-లకు విక్రయిస్తోంది.
ఇందులో 1. ఎర్లీ ఇన్స్క్రిప్షన్స్, 2. ఇన్స్కిప్షన్స్ ఆఫ్ సాలువ నరసింహ టైమ్, 3. ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ కృష్ణరాయ టైమ్, 4. ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అచ్యుతరాయ టైమ్, 5. ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ సదాశివరాయ టైమ్, 6. ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ వెంకటపతిరాయ టైమ్, 7. ఎపిగ్రాఫికల్ గ్లాసరీ ఆన్ తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ ఇన్స్క్రిప్షన్స్, 8. రిపోర్ట్ (ఆన్ ది ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ది దేవస్థానం కలెక్షన్ విత్ ఇల్లస్ట్రేషన్స్) శీర్షికలతో పుస్తకాలున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, ఇతర ఆలయాల నుండి సేకరించిన శాసనాల సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. పల్లవులు, చోళులు, పాండ్యులు, తెలుగు పల్లవులు, యాదవరాయలు, విజయనగరరాజుల్లో సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం రాజులు, అరవీడు రాజుల కాలం నాటి శాసనాల వివరాలు ఉన్నాయి. ప్రతి శాసనాన్ని కక్షుణ్ణంగా పరిశోధించి అందులోని అంశాన్ని ఆంగ్లంలో అందరికీ అర్థమయ్యేలా పొందుపరిచారు. అంతేగాక ఆయా కాలాల్లో రాజులు శ్రీవారికి సమర్పించిన కానుకలు, స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు, ఆచార్య పురుషులు, మహంతులు, అర్చకులు, ఆలయ అకౌంటెంట్లు, వివిధ దేశాల పౌరులు, వర్తకులు, శ్రీవారిని తమ సంగీత, సాహిత్యాలతో కీర్తించిన వాగ్గేయకారులు, కవులు, ప్రభువులు, రాణులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, సైన్యాధ్యకక్షులు, అప్పట్లో జరుగుతున్న సేవలు, ఉత్సవాలు, శ్రీవారి వాహనాలు, ఉద్యానవనాలు, స్వామివారికి కానుకగా అందించిన అగ్రహారాలు, భూములు, ఆలయాల అభివృద్ధి, మరమ్మతులు తదితర విషయాలతో రూపొందించిన శాసనాలు ఈ గ్రంథాల్లో నిక్షిప్తమయ్యాయి. శ్రీవారి ఆలయ చరిత్రను తెలుసుకోవాలనుకునే భక్తులకు, పరిశోధకులకు ఈ గ్రంథాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఎంతో విలువైన, విస్తృతమైన సమాచారం ఉంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.