జూలై 7వ తేదీ విజయవాడ శ్రీనివాసునికి అభిషేక సేవ

జూలై 7వ తేదీ విజయవాడ శ్రీనివాసునికి అభిషేక సేవ

విజయవాడ, 2017 జూలై 06: విజయవాడ పి.డబ్ల్యు.డి.గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 6.30 గంటలకు సుప్రభాతం, 7.00 గంటలకు తోమాలసేవ, కొలువు, ఉదయం 8.00 గటలకు అర్చన నిర్వహిస్తారు.

అభిషేకం – ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు ….

ఆకాశరాజు తన పుత్రిక పద్మావతిని శ్రీనివాసునకు ఇచ్చి శుక్రవారంనాడు వివాహం జరిపించాడని, అతనిచే తయారు చేయబడిన కిరీటాన్ని స్వామి శుక్రవారంనాడు ధరించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. దీనికి ప్రతీకగానే స్వామికి శుక్రవారంనాడు అభిషేకం జరిపి నూతనవస్త్రాన్ని ధరింపజేసి కిరీటమును సమర్పిస్తారు.

అభిషేకంలో సుగంధద్రవ్యాలు అనేకాలు చోటు చేసుకుంటాయి. కర్పూరం, పునుగు తైలం, వట్టివేరు, జాజికాయ, జాపత్రి మొదలైనవి ఉంటాయి. శుక్రవారంనాడు లక్ష్మీదేవికి ప్రాధాన్యత. ఆనాడు స్వామిని అభిషేకిస్తే సర్వసంపదలు కలుగుతాయని ఆగమశాస్త్రం చెబుతుంది.

పురాణాలకు, ఆగమశాస్త్రాలకు రెండింటినీ సమన్వయించి భక్తులను తన్మయత్వ సంపన్నులుగా చేసేది ఈ అభిషేకం.

సాంస్కృతిక కార్యక్రమాలు

ఇందులో భాగంగా సాయంత్రం 4.00 నుంచి 6.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ బాలకృష్ణ ప్రసాద్‌ మరియు శ్రీమతి బుల్లెమ్మ బృందం భక్తి సంగీతం, రాత్రి 7.00 నుండి 8.15 గంటల వరకు నిడదవోలుకు చెందిన శ్రీధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి ధార్మిక ఉపన్యాసం ఇవ్వనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.