అక్టోబరు 4 నుండి 6వ తేదీ వరకు శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

అక్టోబరు 4 నుండి 6వ తేదీ వరకు శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

అక్టోబరు 03, తిరుపతి, 2017: టిటిడికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 4 నుండి 6వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మంగళవారం సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అక్టోబరు 4వ తేదీ బుధవారం ఉదయం 9.00 గంటలకు యాగశాల పూజ, చతుష్టానార్చన, హోమం, పవిత్రప్రతిష్ఠ, స్నపనతిరుమంజనం జరుగనున్నాయి. అక్టోబరు 5న గురువారం ఉదయం పవిత్రసమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబరు 6న శుక్రవారం ఉదయం యాగశాల పూజ, మహాపూర్ణాహుతి, స్నపనతిరుమంజనం, రాత్రి తిరువీధి ఉత్సవంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, స్వామివారి అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.