VATAPATRASAI MUSES DEVOTEES _ వటపత్రశాయి అలంకారంలో కోదండరాముని కటాక్షం

Vontimitta, 12 April 2022:  As part of the ongoing annual Brahmotsavam in vontimitta at YSR Kadapa district on Tuesday morning Sri Kodandarama blessed His devotees in Vatapatrasai Alankaram.

The bright sunny day on Tuesday witnessed a huge turnout of devotees who were thrilled by the glimpse of Sri Rama in this unique Alankara.

Temple authorities and archakas were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

వటపత్రశాయి అలంకారంలో కోదండరాముని కటాక్షం
 
ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 12: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడ‌వ‌‌ రోజు మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. 
 
అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరుగనుంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేస్తారు.
 
సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. 
 
పురాణాల ప్రకారం.. జలప్రళయం సంభవించినపుడు శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ శిశువుగా దర్శనమిస్తారు. కుడికాలి బొటనవేలిని నోటిలో పెట్టుకుని ఆస్వాదిస్తుంటారు. ఈ ఘట్టాన్ని గుర్తుచేస్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు భక్తులకు కనువిందు చేశారు.
 
భక్తుల కష్టాలను కడతేర్చేందుకు ఎప్పుడూ ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తున్నారు. వటపత్రశాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనల్లో చక్కగా వర్ణించారు.  
 
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ డా. రమణప్రసాద్, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆర్.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.