వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

మార్చి 24, తిరుపతి, 2018: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరుగనున్న వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది.

ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 4 నుండి 6 గంటల వరకు మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహిస్తారు.

మార్చి 25న ధ్వజారోహణం :

మార్చి 25న ధ్వజారోహణంతో ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.03 గంటలకు వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు శేష వాహనసేవ జరుగనున్నాయి. ప్రతిరోజూ రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 25న శ్రీరామనవమి, మార్చి 26న హంసవాహనం, మార్చి 27న సింహ వాహనం, మార్చి 28న హనుమంత వాహనం, మార్చి 29న గరుడవాహన సేవలు జరగనున్నాయి. మార్చి 30వ తేదీ రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగనుంది. అనంతరం గజ వాహనసేవ నిర్వహిస్తారు. మార్చి 31న రథోత్సవం, ఏప్రిల్‌ 1న అశ్వవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు. ఏప్రిల్‌ 2న ఉదయం చక్రస్నానం, సాయంత్రం 5.30 గంటలకు ధ్వజావరోహణం ఉత్సవాలు ముగియనున్నాయి. ఏప్రిల్‌ 3న సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు.

సాంస్కృతిక కార్యక్రమాలు :

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ధార్మికోపన్యాసం, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో భక్తి సంగీతం, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మార్చి 25న శ్రీరామనవమి సందర్భంగా సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 30న కల్యాణోత్సవం సందర్భంగా సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శ్రీమతి మండా సుధారాణి, శ్రీమతి వందన, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ చైతన్య సోదరులు గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ దీవి హయగ్రీవాచార్యులు, శ్రీ కడిమెళ్ల వరప్రసాద్‌, శ్రీబి.వి.నరసింహదీక్షితులు కల్యాణోత్సవానికి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.