శ్రీవారి ఆలయంలో మార్చి 25న శ్రీరామనవమి ఆస్థానం, 26న శ్రీరామపట్టాభిషేకం

శ్రీవారి ఆలయంలో మార్చి 25న శ్రీరామనవమి ఆస్థానం, 26న శ్రీరామపట్టాభిషేకం

మార్చి 24, తిరుమల 2018: మార్చి 25వ తేది అదివారం శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం, మార్చి 26వ తేదిన శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ మరియు అర్చనను ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు.

కాగా రాత్రి 7.00 నుండి 9.00 గంటల నడుమ శ్రీ మలయప్పస్వామివారు హనుమద్వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం రాత్రి 10.00 నుండి 11.00 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీ రామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు.

మార్చి 26వ తేదీ సోమవారంనాడు రాత్రి 8.00 గంటలకు బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నేత్రపర్వంగా నిర్వహించే ఈ రెండు కార్యక్రమాలలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం నిర్వహించే వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా మార్చి 26వ తేదీ శ్రీరామపట్టాభిషేక మహోత్సవం కారణంగా వసంతోత్సవ సేవను టిటిడి రద్దు చేసింది. మిగిలిన ఆర్జిత సేవలు యదావిధిగా కొనసాగుతాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.