WORK WITH EXTRA ENERGY AS A TEAM ON GARUDA SEVA _ గరుడసేవను సమష్టి కృషితో విజయవంతం చేయాలి

TIRUMALA, 15 OCTOBER 2026: The TTD employees, Vigilance police and district officials are given a clarion call to work as a team by putting extra efforts and enthusiasm on Garuda Seva that occurs on October 16.

Addressing the deputed staff for G- day at Asthana Mandapam in Tirumala on Thursday evening. The Additional EO Sri Ch Venkaiah Chowdary said everyone should work with more dedication and put extra energy as this brahmotsavams may witness inclement weather conditions as predicted by the weather department and should be prepared for disaster management, he observed.

Finally every one should work hard to their full capacities and ensure that every pilgrim gets good darshan of Srivaru as well Vahana Seva and keep up the reputation of the institution.

JEOs Dr Sharath, Sri Gopinath, CVSO Sri Muralikrishna, SP Sri Subbarayudu, CPRO Dr Ravi, Annaprasadam Catering Officer Sri Shastry and other HoDs from various TTD departments, Vigilance, Police Officials, deputation staff were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

గరుడసేవను సమష్టి కృషితో విజయవంతం చేయాలి

భక్తులకు మెరుగైన సేవలందించడమే ప్రథమ కర్తవ్యం

వర్ష సూచనల నేపథ్యంలో విపత్తుల నిర్వహణకు అప్రమత్తంగా ఉండాలి

విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా అంకితభావంతో పనిచేయాలి : టీటీడీ అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి

తిరుమల, అక్టోబరు 15, 2026: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవను అక్టోబరు 16న సమష్టి కృషితో విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. స్వామివారిపై అపార విశ్వాసంతో తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సంతృప్తికరమైన దర్శనం, వాహనసేవను కల్పించడమే ప్రతి ఉద్యోగి ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.

తిరుమలలోని ఆస్థాన మండపంలో గురువారం సాయంత్రం గరుడసేవ విధులకు నియమించిన సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ ఉద్యోగులు, విజిలెన్స్, పోలీసు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో మరింత ఉత్సాహంగా, అంకితభావంతో పనిచేసి గరుడసేవను విజయవంతం చేయాలని సూచించారు.

వర్ష సూచనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు

వాతావరణ శాఖ వర్ష సూచనలు చేసిన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వర్షం వల్ల ఎదురయ్యే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు విపత్తుల నిర్వహణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కేటాయించిన ప్రాంతాల్లో బాధ్యతాయుతంగా విధులు

సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అదనపు ఈవో సూచించారు. చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

శాఖల వారీగా ఉన్నతాధికారులకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించాలని, ప్రతి ఒక్కరూ పూర్తి సామర్థ్యంతో పనిచేసి భక్తుల సౌకర్యానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. గరుడసేవకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సౌకర్యవంతమైన దర్శన అనుభవాన్ని అందించి టీటీడీ ప్రతిష్ఠను మరింత పెంపొందించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జేఈవోలు డా. ఎ. శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, సీపీఆర్వో డా. రవి, అన్నప్రసాదం క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి, వివిధ విభాగాల అధికారులు, విజిలెన్స్, పోలీసు అధికారులు, విధులకు నియమించిన సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ద్వారా విడుదల