YOGA NARASIMHA RIDES ON SIMHA VAHANA_ సింహ వాహనంపై యోగ నరసింహుడి అవతారంలో శ్రీ క‌ల్య‌ణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

Srinivasa Mangapuram, 26 February 2019: On the third day morning of the ongoing annual brahmotsavams in Srinivasa Mangapuram, Sri Kalyana Venkateswara Swamy took pride ride on the ferocious Simha Vahana in the guise of Yoga Narasimha.

Narasimhavatara is considered to be one of the most significant incarnations of the Dasavatara of Sri Maha Vishnu.

The kolatam, dance troupes which performed in front of the vahanam added the zing thing to the procession.

Three devotional books were released during the vahana seva.

Temple DyEO Sri Dhananjeyulu, AEO Sri Lakshmaiah, Superintendent Chengalrayulu,Temple Inspector Sri Anil, Temple Priests and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సింహ వాహనంపై యోగ నరసింహుడి అవతారంలో శ్రీ క‌ల్య‌ణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి,2019 ఫిబ్రవరి 26: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ నరసింహుని అవతారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహంపై కూర్చొని ఊరేగుతారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారి నిరూపిస్తున్నారు.

కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళయే అనుకూలం. అందుకే కల్యాణ శ్రీనివాసునికి మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. మాంసమయమైన ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ల‌క్ష్మ‌య్య‌, టిటిడి వైఖానస ఆగమ సలహాదారులు శ్రీఎన్‌ఎకె.సుందరవదనాచార్యులు, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

సింహ‌ వాహ‌నసేవ‌లో మూడు ఆధ్యాత్మిక పుస్త‌కాల ఆవిష్క‌ర‌ణ

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ నరసింహుని అవతారంలో సింహ వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ఈ సంద‌ర్భంగా టిటిడి ప్ర‌చుర‌ణ‌ల విభాగం ఆధ్వ‌ర్యంలో ముద్రించిన శ్రీహరి లీలామృతం, కాదంబ‌రి , జీవాస్‌ ప్రొఫండిటి ఇన్‌ విశిష్టాద్వైత ఫిలాసఫి (ఇంగ్లీష్‌) పుస్త‌కాల‌ను టిటిడి స్థానిక ఆల‌యాల డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు ఆవిష్క‌రించారు. అనంత‌రం రచ‌యిత‌ల‌ను శాలువ‌తో స‌న్మానించి శ్రీ‌వారి ప్ర‌సాదం అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్ర‌త్యేకాధికారి డా.. తాళ్లూరు ఆంజ‌నేయులు, ఉప‌సంపాద‌కుడు డా.. నొస్సం న‌ర‌సింహాచార్య పాల్గొన్నారు.

శ్రీహరి లీలామృతం అనే పుస్త‌కాన్నిశ్రీ పింగళి పాండురంగా రావ్ ర‌చించారు. శాపగ్రస్తుడైన పరీక్షిత్తుకు భాగవతాన్ని బోధించి శుకమహర్షి దు:ఖోపశమనం కలిగించాడు. భాగవతుల యొక్క కథల సమాహారమే భాగవతం. భాగవతం శ్రీహరి అవతారాల వైశిష్ట్యాన్ని విపులంగా వివరిస్తుంది. తెలుగులో మకరందాన్ని నింపిన పద్యాలలో తెలుగువారికి పంచాడు బమ్మెర పోతన. ఆ పద్యాలలోని, గాథలను స్కంధాల వారిగా వచనంలోనికి తీసుకువచ్చి ఆధ్యాత్మికాంశాలకు తావీయకుండా గాథలలో మాధుర్యాన్ని తగ్గనీయకుండా అందించారు.

కాదంబరి అనే పుస్త‌కాన్ని శ్రీ వి.వి.హనుమంతాచార్యులు ర‌చించారు. సంస్కృత కవులలో బాణునికి అతని రచన అయిన కాదంబరి కావ్యానికి ఒక ప్రత్యేకమైన స్థానమున్నది. ”కాదంబరీ రసజ్ఞానాం ఆహారో పి న రోచతే ” అని ఆర్యోక్తి. అంటే రసజ్ఞులైనవారికి కాదంబరి కావ్యముంటే ఆహారం కూడా రుచించదని భావం. తరువాతి కవులకు ఈ కావ్యం మార్గదర్శకమైంది. బాణుడు హర్షవర్ధనుని ఆస్థానకవి.కాదంబరి కావ్యాన్ని వ్రాస్తూ బాణుడు కాలధర్మంచేయగా ఆతని కుమారుడైన భూషణభట్టు తండ్రి రచనకు అనుకూలంగా వ్రాసి పూర్తిచేశాడు. సంస్కృత సాహిత్య పరిరక్షణలో భాగంగా టిటిడి వారు సరళమైన తెలుగు వచనంలో ఈ గ్రంథాన్ని ముద్రించింది.

జీవాస్‌ ప్రొఫండిటి ఇన్‌ విశిష్టాద్వైత ఫిలాసఫి (ఇంగ్లీష్‌) అనే పుస్త‌కాన్ని డా||ఆర్‌ పార్థసారథి ర‌చించారు. ఈ సృష్టిలోని 84లక్షల జీవరాశులలో మనిషి ఒక జీవరాశి. ఈ దేహం పాంచభౌతికమైనది. ఎక్కడి నుండి వస్తున్నాడో ఎక్కడికి వెళుతున్నాడో నేటికీ అంతుచిక్కని ప్రశ్న. ఇది కర్మ సిద్ధాంతం. గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా మరుజన్మ ఉంటుందని మన సిద్ధాంతం. ఇదే సిద్ధాంతాన్ని వివరిస్తూ ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంత కర్తలు గ్రంథాలను వ్రాశారు. ప్రస్తుత గ్రంథం ”జీవాస్‌ ప్రాఫండిటి ఇన్‌ విశిష్టాద్వైత ఫిలాసఫి” మృత్యువు తర్వాత విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు ఎక్కడికి వెళతాడు అన్న విషయమై వివరించిన గ్రంథము.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.