అక్టోబరు 4 నుండి 13వ తేదీ వరకు మహతిలో ”సాహితీ శ్రీనివాసం”

అక్టోబరు 4 నుండి 13వ తేదీ వరకు మహతిలో ”సాహితీ శ్రీనివాసం”

తిరుపతి, అక్టోబరు 01, 2013: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తితిదే శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో అక్టోబరు 4 నుండి 13వ తేదీ వరకు తిరుపతిలోని మహతి కళామందిరంలో ”సాహితీ శ్రీనివాసం” పేరిట సాహిత్యోపన్యాసాలు జరుగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 5.00 నుండి 5.30 గంటల పాటు ఈ ఉపన్యాస కార్యక్రమాలుంటాయని ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీ ఆకెళ్ల విభీషణ శర్మ తెలిపారు.
అక్టోబరు 4వ తేదీన రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ రాళ్లబండి కవితాప్రసాద్‌ ”శ్రీ వేంకటేశ్వర కవితా వైభవం” అనే అంశంపై ఉపన్యసిస్తారు. అక్టోబరు 5న హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయం డీన్‌ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ”వ్యూహ వేంకటేశ్వర వైభవం” అనే అంశంపై ప్రసంగిస్తారు. అక్టోబరు 6న తితిదే హరివంశ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు ” శ్రీ వేంకటేశ్వర ఆధ్యాత్మిక వైభవం” అనే అంశంపై ఉపన్యసిస్తారు. అక్టోబరు 7న రాజమండ్రికి చెందిన ఆచార్య సలాక రఘునాథశర్మ ”తెలుగు సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వర తత్వ వైభవం” అనే అంశంపై ప్రసంగిస్తారు.


అక్టోబరు 8న తిరుపతికి చెందిన ఆచార్య కె.సర్వోత్తమరావు ”కన్నడ సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం” అనే అంశంపై ఉపన్యసిస్తారు. అక్టోబరు 9న కర్నూలుకు చెందిన హిందూధర్మప్రచార పరిషత్‌ పూర్వ కార్యదర్శి డాక్టర్‌ అప్పజోడు వెంకటసుబ్బయ్య ”శ్రీ వేంకటేశ్వర సుప్రభాత వైభవం” అనే అంశంపై ప్రసంగిస్తారు. అక్టోబరు 10న తిరుపతిలోని ఓరియంటల్‌ రీసర్చి ఇనిస్టిట్యూట్‌ సంచాలకులు ఆచార్య వి.వెంకటరమణారెడ్డి ”సంస్కృత సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వర వైభవం” అనే అంశంపై ఉపన్యసిస్తారు. అక్టోబరు 11న తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ చక్రవర్తి రంగనాథన్‌ ”తమిళ సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వర వైభవం” అనే అంశంపై ప్రసంగిస్తారు. అక్టోబరు 12న హైదరాబాదుకు చెందిన ప్రముఖ కవి, గేయరచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ”శతక సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వర వైభవం” అనే అంశంపై ఉపన్యసిస్తారు. అక్టోబరు 13న విజయవాడకు చెందిన డాక్టర్‌ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ”శాసనాలలో శ్రీ వేంకటేశ్వర వైభవం” అనే అంశంపై ప్రసంగిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.