అమిత కృషీవలుడు డా|| భీష్మయ్య నాయుడు – తిరుమల జె.ఇ.ఓ 

అమిత కృషీవలుడు డా|| భీష్మయ్య నాయుడు – తిరుమల జె.ఇ.ఓ

తిరుమల, 30 జనవరి 2013: మితభాషి, దీక్షాదకక్షుడు, అమిత కృషీవలుడైన తిరుమల ఆరోగ్యశాఖాధికారి డా|| భీష్మయ్య నాయుడు తన పదవీ కాలంలో బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్థించారని తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ప్రశంసించారు.
బుధవారం సాయంత్రం తిరుమలలోని కల్యాణ వేదిక ప్రాగంణంలో తి.తి.దే ఆరోగ్యశాఖాధికారి గురువారంనాడు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆరోగ్యశాఖ విభాగం ఆధ్వర్యంలో శ్రీ భీష్మయ్యనాయుడుకు వీడ్కోలు సన్మానసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తిరుమల జె.ఇ.ఓ మాట్లాడుతూ డా||భీష్మయ్యనాయుడు తి.తి.దే ఆరోగ్యశాఖాధికారిగా ఉన్న ఒకటిన్నర సంవత్సర కాలం ఎంతో క్రమశిక్షణతో, ఉత్సాహంతో విధులు నిర్వహించి పరిశుభ్రత విషయంలో తి.తి.దేకు అంతర్జాతీయ గర్తింపు తీసుకువచ్చారన్నారు.  తమ సిబ్బందికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరాది వంటి పర్వదినాల్లో భక్తులకు అద్భుతమైన సేవలందించారని ప్రశంసించారు.
అనంతరం డా|| భీష్మయ్యనాయుడు మాట్లాడుతూ శ్రీవారి కొలువులో సేవలు చేసి పదవీ విరమణ పొందడం తన తల్లితండ్రుల పుణ్యఫలం మరియు తన పూర్వజన్మ సుకృతమన్నారు. తన హయాంలో తి.తి.దేకు పారిశుద్ధ్యంలో అంతర్జాతీయ బహుమతి రావడం తన సిబ్బంది యొక్క ఉమ్మడి సహకారం, కృషి వల్లే సాధ్యమైందని అన్నారు. తన 23 ఏళ్ళ ఉద్యోగ ప్రస్థానంలో తి.తి.దేలో పనిచేసిన సంతృప్తి చాలా గొప్ప అనుభూతిని మిగిల్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నంగారి రమణ మాట్లాడుతూ పై అధికారులతో అత్యంత వినమ్రతతో విధేయతతో నడచుకుంటూ వారి ఆదేశాలను పాటిస్తూ తదనుగుణంగా కర్తవ్య నిర్వహణలో మంచి ఫలితాలను తీసుకువచ్చిన వినయశీలి డా|| భీష్మయ్య నాయుడు అన్నారు. ఆయన వినమ్రత ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని అన్నారు. తి.తి.దే చరిత్రలోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో పారిశుద్ధ్య పురస్కారం తీసుకువచ్చిన ఘనత ఆయనదని కితాబునిచ్చారు.
అనంతరం తిరుమల జే.ఇ.ఓ శ్రీ భీష్మయ్యనాయుడు దంపతులను దుశ్శాలువ కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనిట్‌ అధికారి శ్రీ అమరనాథరెడ్డి, డా|| వెంకారెడ్డి, కల్యాణకట్ట డిప్యూటి.ఇ.ఓ శ్రీ బాలాజీ తదితర అధికారులు మరియు ఆర్యోగశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.