ఇక తితిదే ప్రాజెక్టులన్నీ ఒకే ప్రాంతంలోనే : తిరుపతి జెఈవో

ఇక తితిదే ప్రాజెక్టులన్నీ ఒకే ప్రాంతంలోనే : తిరుపతి జెఈవో

తిరుపతి, ఫిబ్రవరి 01,2013: తితిదేలో ఆధ్యాత్మిక, భక్తిభావ ప్రచారానికి ఇతోధికంగా సేవలందిస్తున్న వివిధ ప్రాజెక్టులన్నీ ఒకేచోట ఉండడం ద్వారా బృహత్తర కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం ఆయన తిరుపతిలోని పాత ప్రసూతి ఆస్పత్రి(శ్రవణం) ప్రాంగణంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తితిదేలో పనిచేస్తున్న వివిధ ప్రాజెక్టులకు వేరువేరు ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్నాయని, వాటన్నింటికీ ఒకే ప్రాంతంలో కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అన్నారు. ఈ కార్యాలయానికి అవసరమైన ప్రదేశం, ఆయా ప్రాజెక్టుల అధిపతులు, సిబ్బంది అవసరాలు గుర్తించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ బృందంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాథ్‌, చీఫ్‌ లైజాన్‌ ఆఫీసర్‌ శ్రీ వెంకటశర్మ, ట్రాన్స్‌పోర్టు జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ శ్రీ సుధాకర్‌రావు ఉంటారని వెల్లడించారు. తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తితిదే కార్యాలయాలను పరిశీలించి అనువుగా ఉన్న ప్రాంతాన్ని తెలియజేయాలని ఈ బృందంలోని అధికారులను ఆదేశించారు. కాగా తితిదేలోని అన్ని ప్రాజెక్టులు తమ వంద రోజుల కార్యక్రమాలతో ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా జెఈవో ఆయా అధికారులను ఆదేశించారు.
 
అనంతరం అలహాబాదులోని మహాకుంభమేళా విశేషాలను చర్చించడమే గాక వారణాసి, అలహాబాద్‌, చిత్రకూట, అయోధ్య, నైమిషారణ్యం ప్రాంతాల్లో శనివారం నుండి జరుగనున్న శ్రీవారి కల్యాణోత్సవాల ఏర్పాట్లు గురించి చర్చించారు. జెఈవో సమీక్ష అనంతరం అధికారుల బృందం తిరుపతిలోని వివిధ తితిదే భవనాలను సందర్శించింది.
 
ఈ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, తితిదే ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఆచార్య రవ్వా శ్రీహరి, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.