ఘనంగా శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పి.జి కళాశాల వార్షికోత్సవం
తిరుపతి, జనవరి 31, 2013: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పి.జి కళాశాల 61వ వార్షికోత్సవం గురువారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఫ్రొపెసర్ ఎస్.రత్నకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ కళాశాల విద్యార్థినులకు తితిదే అన్ని వసతులు కల్పిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకుని అన్ని పోటీ పరీక్షలలో విజయం సాదించాలని అన్నారు. జీవితంలో గమ్యం నిర్ణయించుకుంటే అభివృద్ధి సాధించవచ్చని, లక్ష్యసాధనకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులు కష్టపడేతత్వాన్ని అలవాటు చేసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలను కొదవలేదన్నారు.
విశిష్ట అతిథిగా హాజరైన హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు మంచి ఆలోచనలతో, నడవడికతో ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధిస్తారని పేర్కొన్నారు. జయానికి, అపజయానికి మధ్య ఉన్న తేడాను, వాటికి దారితీసే పరిస్థితులను సోదాహరణంగా వివరించారు. తితిదే విద్యాశాఖాధికారి శ్రీ పి.వి.శేషారెడ్డి ప్రసంగిస్తూ విద్యార్థినులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు వివేకానందుని రచనలు చదవాలని సూచించారు. అనంతరం వివిధ క్రీడలలో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. వార్షికోత్సవానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కె.సుజాత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.