జూలై 14 నుండి 16వ తేది వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు

జూలై 14 నుండి 16వ తేది వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు

తిరుపతి, 2010 జూలై 04: శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి సాక్షాత్కార వైభవం ఉత్సవాలు ఈనెల 14వ తేది నుండి 16వ తేది వరకు మూడు రోజులపాటు వైభవంగా జరుగుతాయి.

ఈ సాక్షాత్కార ఉత్సవాలలో మొదటి రోజు ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం సాయంత్రం ఊంజలసేవ నిర్వహించి రాత్రి 7.30 గంటలకు తిరుచ్చి వాహనంలో స్వామివారు మాడవీధులలో విహరిస్తారు. రెండవ రోజు ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజలసేవ నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు స్వామివారు, హనుమంత వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అదేవిధంగా మూడవ రోజు ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజలసేవ నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు స్వామివారు గరుడవాహనాన్ని అధిరోహించి భక్తులకు కనువిందైన దర్శనం కల్పిస్తారు. ఈ మూడు రోజుల పాటు తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయి.

ఈ ఉత్సవము శ్రీనివాస మంగాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది. పూర్వము ఈ ఆలయం శిధిలావస్థలో వుండి దీప, ధూప, నైవేద్యాలు జరగకుండా వున్నప్పుడు శ్రీనివాసుడు శ్రీ సుందరాచార్యులవారికి స్వప్నంలో దర్శనమిచ్చి శ్రీనివాసమంగాపురం ఆలయంలో ప్రతిరోజు పూజలు జరిపి దీప, ధూప, నైవేద్యాలు కొనసాగించాలని ఆదేశించారట.

ఆషాడశుద్ధ షష్ఠిరోజు నుండి శ్రీనివాసమంగాపురములోని స్వామివారికి యథావిధిగా పూజలు కొనసాగించారు. ఇక అప్పటి నుండి ప్రతి సంవత్సరం 3 రోజులపాటు సాక్షాత్కార వైభవం ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తున్నది.

అదేవిధంగా జూలై 12వ తేదిన ఆలయంలో కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈసందర్భంగా జూలై 14వ తేదిన అష్టోత్తరశతకలశాభిషేకం, జూలై 15వ తేదిన తిరుప్పావడి సేవ, జూలై 14 నుండి 16  వరకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దుచేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.