జూలై 27న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం
జూలై 27న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం
తిరుపతి, 2012 జూలై 23: వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో జూలై 27వ తేదీన అష్టోత్తర శతకలశాభిషేకం, శ్రీ సూక్తహోమం ఘనంగా నిర్వహించనున్నారు. అదేవిధంగా శ్రావణమాసం సందర్భంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి ఊంజల్‌సేవ జరుగనుంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి శుద్ధి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన, నిత్యహోమం నిర్వహించనున్నారు. అనంతరం శ్రీ వేణుగోపాలస్వామి మూల వర్లకు తిరుమంజనం, మూలవర్ల సమర్పణ జరుగనుంది. ఉదయం 9.00 గంటలకు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి శతకలశాభిషేకం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.00 గంట నుండి 3.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. సాయంత్రం 6.00 గంటలకు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించనున్నారు.
భక్తులు రూ.30/- టికెట్ కొనుగోలు చేసి వరలక్ష్మీ వ్రతం రోజున, శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి నిర్వహించే అభిషేకంలో పాల్గొనవచ్చు. ఈ రోజుల్లో మహిళా భక్తులకు ఒక కుంకుమ ప్యాకెట్, పసుపుదారమును ఉచితంగా అందజేస్తారు. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.