జూలై 6 నుండి మెదక్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు

జూలై 6 నుండి మెదక్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, జూలై 02, 2013: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 6వ తేదీ నుండి మెదక్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. జూలై 10వ తేదీ వరకు మొత్తం నాలుగు ప్రాంతాల్లో స్వామివారి కల్యాణాలు చేపట్టనున్నారు.

జూలై 6వ తేదీన మెదక్‌ జిల్లా నంగునూరులోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద నంగునూరి వారి ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ఉదయం 10.00 గంటలకు  శ్రీవారి కల్యాణం కన్నులపండువగా జరుగనుంది. జూలై 7వ తేదీన హైదరాబాదులోని డాక్టర్‌ ఎ.ఎస్‌.రావు నగర్‌లో గల సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమ కేంద్రం మైదానంలో సాయత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.

అదేవిధంగా జూలై 9వ తేదీన మెదక్‌ జిల్లాలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో  ఎద్దుమైలారంలో గల ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఎస్టేట్‌లో సాయంత్రం 6.00 గంటల నుండి శ్రీనివాస కల్యాణం వైభవంగా జరుగనుంది. జూలై 10వ తేదీన హైదరాబాదులోని ఖైరతాబాద్‌ చింతల్‌బస్తీలో గల రామ్‌లీలా మైదానంలో ఎంఎల్‌సి శ్రీ ఎం.ఎస్‌.ప్రభాకరరావు ఆధ్వర్యంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఓఎస్‌డి శ్రీ కె.రామకృష్ణ ఈ కల్యాణోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శ్రీవారి కల్యాణోత్సవాల సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
  
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.