ఫిబ్రవరి 10 నుండి కర్ణాటకలో మూడు చోట్ల శ్రీనివాస కల్యాణాలు

ఫిబ్రవరి 10 నుండి కర్ణాటకలో మూడు చోట్ల శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, ఫిబ్రవరి 06, 2013: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రాభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో  ఫిబ్రవరి 10వ తేదీ నుండి కర్ణాటక రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు వైభవంగా జరుగనున్నాయి.
ఉడిపి శాసనసభ్యులు శ్రీ రఘుపతి భట్‌ ఆధ్వర్యంలో ఉడిపి పట్టణంలో ఫిబ్రవరి 9వ తేదీన శోభాయాత్ర, ఫిబ్రవరి 10వ తేదీన మాల్పే బీచ్‌లో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 12న మంగళూరు నగరంలో సార్వజనిక శ్రీనివాస కల్యాణోత్సవ సమితి అధ్యకక్షులు శ్రీ కె.అజిత్‌కుమార్‌ రాయ్‌ మాలాడి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం వైభవంగా జరుగనుంది. ఫిబ్రవరి 20వ తేదీన కోలారు జిల్లా శ్రీనివాసపూరు తాలుకా, గానిబండే పట్టణంలో శ్రీ గానిబండె వెంకటరమణస్వామి ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం కన్నులపండువగా జరుగనుంది. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్‌ కె.రామకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
     
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.