మే 21 నుండి 23 వరకు మంగాపురం వెంకన్న వసంతోత్సవాలు

మే 21 నుండి 23 వరకు మంగాపురం వెంకన్న వసంతోత్సవాలు

తిరుపతి, మే,16, 2011: సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరస్వామి ప్రతిరూపంగా పూజలందుకొంటున్న శ్రీనివాస మంగాపురం కల్యాణవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 21 నుండి 23 వరకు వసంతోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.
 
వైఖానసమాసం శ్రవణానక్షత్రాన్ని పురష్కరించుకొని ప్రతి ఏటా ఈ వార్షిక వసంతోత్సవాలను తితిదే మూడు రోజులపాటు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 8.30 గంటలకు ఉత్సవరులు ఆలయం నుండి వసంత మండపానికి వేంచేపుచేస్తారు. తొలి రెండు రోజులు అంటే మే 21, 22 తారీఖులలో మలయప్పస్వామి తన ఉభయనాంచారులతో కూడి వసంతోత్సవంలో పాల్గొంటారు. అయితే చివరి రోజు మాత్రము శ్రీ భూసమేత మళయప్పస్వామి,  సీతాలక్ష్మణహనుమాన్‌సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీసత్యభామసమేత శ్రీ కృష్ణస్వామి వార్ల ఉత్సవ మూర్తులను వసంత మండపానికి వేంచేపుగా తీసుకొని వచ్చి ఆస్థానాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
 
కాగా ప్రతి రోజు మధ్యాహ్నం 2.00 నుండి 4-00 వరకు స్నపనతిరుమంజనం తరువాత అలంకారం వుంటుంది. ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 వరకు ఊంజలసేవ నిర్వహిస్తారు.
 
వసంతోత్సవం పురస్కరించుకొని ఈ మూడురోజుల పాటు ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలను తితిదే రద్దుచేసినది. ఈ ఉత్సవం సందర్భంగా తితిదే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.