VEDAS TO LEAD A RIGHTEOUS LIFE – TTD BOARD CHIEF _ వేద విద్యను పంచండి-విజ్ఞానాన్ని పెంచండి – తి.తి.దే ఛైర్మెన్
వేద విద్యను పంచండి-విజ్ఞానాన్ని పెంచండి – తి.తి.దే ఛైర్మెన్
తిరుమల, 13 సెప్టెంబరు 2013 : భగవంతుని సృష్టిలో అత్యంత ఉత్కృష్టమైన మానవజన్మను సార్థకం చేసుకోవాలంటే వేద విజ్ఞాన సారస్వాన్ని నేర్చుకొని పదిమందికి ఆ విద్యను నేర్పించి సమాజంలో విజ్ఞానాన్ని పెంచాలని తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు అన్నారు.
శుక్రవారంనాడు తిరుమలలోని ధర్మగిరిలోని వేదపాఠశాలలో స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కనుమూరు బాపిరాజు మాట్లాడుతూ ఓంకార శబ్దం నుండి ఆవిర్భవించిది వేదాలన్నారు. ఈ సమాజంలో విజ్ఞానాన్ని పంచడమే లక్ష్యంగా ఆవిర్భవించిన వేదాలకు అంతంలేదన్నారు. వేద విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో మిళితం చేసి నవీన జ్ఞానవిజ్ఞానాన్ని సమాజానికి పంచాలన్నారు. వేదం అభ్యసించే విద్యార్థులు తల్లితండ్రులను వీడి 12 సంవత్సరాల పాటు ధర్మగిరి వేదపాఠశాలలో వేద విద్యనభ్యసించడం ముదావాహం అన్నారు. ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో కనుమరుగై పోతున్న వేద విద్యను పునరుజ్జీవనింపచేయడానికి తమ పిల్లలను వేద విద్యాభ్యాసం చేయడానికి పంపుతున్న తల్లితండ్రులకు తన ప్రత్యేక అభినందన ప్రణామాలన్నారు.
అంతకు పూర్యం ప్రముఖ వైద్యులు డా|| అల్లాడి మోహన్ ఉపన్యసిస్తూ మన వేదాల్లో వివిధ రోగాలకు విరుగుడు కొన్ని వేల సంవత్సరాలకు మునుపే మన పూర్వీకులు నిక్షిప్తం చేశారన్నారు. వేదాల్లో సమాజహితాన్ని తెలిపే అంశాలు కోకొల్లలన్నారు. కృష్ణ యజుర్వేద సంహిత 2వ కాండంలోని 5వ ప్రకరణలో క్షయవ్యాధి గురించి, ఆ వ్యాధి నివారణను కూడా స్పష్టంగా తెలిపారన్నారు.వేదాలను గురించి అధ్వయనం చేసి అనేక సమస్యలకు పరిష్కారాలను అన్వేషించాలన్నారు. సమాజంలో వేద విద్య పట్ల వున్న చిన్నచూపు తొలగించి వేదమే విజ్ఞాన సర్వస్వమని వేద విద్యార్థులు నిరూపించాలన్నారు.
అనంతరం ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ జి.వి.జి అశోక్‌కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే వేదవిజ్ఞానాన్ని నేర్పే అతి పెద్ద సంస్థగా ధర్మగిరి వేదపాఠశాల ఆవిర్భవించిందన్నారు. సాక్షాత్తు స్వామివారి పాదాల చెంత వెలసివున్న ధర్మగిరి వేద పాఠశాలలో వేద విద్యనభ్యసించడం పూర్వజన్మ సుకృతమన్నారు.
కాగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు మాట్లాడుతూ వేద విద్య థదిశలా వ్యాపింపజేయడమే లక్ష్యంగా తి.తి.దే ధర్మగిరి వేదపాఠశాలను అభివృద్ధి చేసిందన్నారు. గత 130 ఏళ్ళ సుదీర్గ చరిత్రలో ఇక్కడ వేదం నేర్చుకున్న అనేకానేకమంది విద్యార్థులు నేడు ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల్లో వివిధ హోదాల్లో వేద విద్యలో రాణిస్తున్నారన్నారు. హైంధవ సనాతన ధర్మానికి ప్రతీక అయిన వేదవిద్యను పరిరక్షించడానికి తి.తి.దే విశేషకృషి చేస్తున్నదన్నారు. వేద విద్యార్థులు క్రమశిక్షణతో, అంకుఠిత దీక్షతో వేద విద్యను అభ్యసించి భవిష్యత్తు తరాలవారికి వేదవిద్యను అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతకు పూర్వం ప్రారంభ ఉపన్యాసంలో వేదపాఠశాల ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీ అవధాని మాట్లాడుతూ ఈ వేదపాఠశాలను 1884వ సంవత్సరంలో ఏర్పాటుచేయబడి వేలాదిమంది విద్యార్థులను లోకానికి అందించిందన్నారు. నేడు తొలిసారిగా వివిద వేథాఖలకు చెందిన 72మంది విద్యార్థులు పట్టభద్రులు అవుతున్నారన్నారు.
అనంతరం ఉత్తీర్ణత చెందిన విద్యార్థులకు తి.తి.దే ఛైర్మెన్ శ్రీ కనుమూరు బాపిరాజు, జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివారాజు తదితర ప్రముఖులు ప్రసంశా పత్రాలను, నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఇ.ఓ శ్రీ పాపయ్యనాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.