వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలు ప్రారంభం
వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి, సెప్టెంబరు 17, 2013: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించారు.
మధ్యాహ్నం శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా పవిత్రోత్సవాల కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ ఆర్జిత సేవలను రద్దు చేశారు.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈఓ శ్రీ భాస్కర్‌రెడ్డి, ఏఈఓ శ్రీమతి నాగరత్న, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.