శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా ధ్వజారోహణం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా ధ్వజారోహణం

తిరుపతి, మార్చి 1, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం ఉదయం 9.30 నుండి 9.50 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

 

అంతకుముందు ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఎలా జరిగాయోనని స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ట, రక్షా బంధనం చేపట్టారు. మేష లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజాలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠిస్తారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం చేసిన పుణ్యంతో సాటిరాదని పురాణాలు చెబుతున్నాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతోపాటు సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.
ఈ సందర్భంగా తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి మీడియాతో మాట్లాడుతూ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఈసారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల భక్తులకు అన్నదానం, ఆకర్షణీయంగా పుష్పాలంకరణలు, క్షేత్ర మహిమను తెలిపేలా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటుచేశామని తెలిపారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో స్వామివారి ఆలయం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
తితిదే వైఖానస ఆగమసలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వరస్వామివారు నారాయణవనంలో శ్రీ పద్మావతి దేవిని వివాహం చేసుకున్న అనంతరం అగస్త్య మహాముని ఆదేశం మేరకు శ్రీనివాసమంగాపురంలో ఆరుమాసాల పాటు ఉన్నట్టు తెలిపారు. ఇక్కడి కల్యాణ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న వారికి వివాహయోగం కలుగుతుందని, సకలశుభాలు కలుగుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ లక్ష్మణ్‌ నాయక్‌, తితిదే సూపరింటెండెంట్‌ ఇంజినీరు శ్రీ సుధాకరరావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు శ్రీ నాగేశ్వరరావు, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

పెద్దశేష వాహనంపై శ్రీనివాసుడి వైభవం :

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామివారు విహరించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారు స్వయంగా ఊరేగింపులో పాల్గొనే  మొదటి ఉత్సవం పెద్దశేషవాహనం. ఈ శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి అయినా శ్రీనివాసమంగాపురంలో వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నాడు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే నాకు నిత్యా సేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తున్నారు.
            
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.