సంగీత వాయిద్యాలకు రారాజు వయొలిన్ : శ్రీమతి చల్లా ప్రభావతి
సంగీత వాయిద్యాలకు రారాజు వయొలిన్ : శ్రీమతి చల్లా ప్రభావతి
తిరుపతి, 2012 సెప్టెంబరు 7: సంప్రదాయ సంగీత వాయిద్యాల్లో వయొలిన్‌కు ఎనలేని ప్రాధాన్యత ఉందని, ఇది సంగీత పరికరాలకు రారాజు లాంటిదని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి చల్లా ప్రభావతి అన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో శుక్రవారం ”సంగీతానుభవ’ పేరిట వయొలిన్ విద్యార్థులకు సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీమతి చల్లా ప్రభావతి ప్రసంగిస్తూ కర్ణాటక, హిందుస్థానీ, పాశ్చాత్య సంగీతంలో వయొలిన్‌కు ప్రముఖమైన స్థానం ఉందని తెలిపారు. కళాశాలలో నృత్యకళతో పాటు సంగీతానికి విద్యార్థుల నుండి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. 50 ఏళ్ల కాలంలో మొదటిసారిగా వయొలిన్ విభాగంలో సదస్సు నిర్వహించినట్టు తెలిపారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతికి చెందిన ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు శ్రీ కోమండూరి శేషాద్రి ప్రసంగిస్తూ విద్యార్థులు వయొలిన్ వాద్యంలో మెళకువలు తెలుసుకునేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ఆయన పర్యవేక్షణలో సదస్సు సాగింది.
ముందుగా చెన్నైకి చెందిన శ్రీరాం శ్రీధర్ వయొలిన్ కచేరీతో ఉదయం 10.00 గంటలకు సదస్సు ప్రారంభమైంది. అనంతరం హైదరాబాద్‌కు చెందిన ప్రఖాత వయొలిన్ విద్వాంసులు పెరి శ్రీరామమూర్తి ప్రసంగిస్తూ వయొలిన్ చరిత్రను తెలియజేశారు. రామాయణ కాలం నుండి ఈ సంగీత పరికరాన్ని ఉపయోగిస్తున్నారని, పాశ్చాత్య దేశాల్లో పలురకాల పేర్లతో దీన్ని పిలుస్తున్నారని వివరించారు. భారతదేశంలో బ్రిటీషువారి కాలంలో శ్రీ బాలస్వామి దీక్షితులు మొదటగా వయొలిన్‌ను నేర్చుకున్నారని తెలిపారు.
ఆ తరువాత చెన్నైకి చెందిన ప్రఖ్యాత సంగీత కళాకారిణి కుమారి కన్యాకుమారి సాధనా విధానం, వాద్యతంత్రం, చేతివేళ్ల సాధన అనే అంశాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం చెన్నైకి చెందిన సీనియర్ కళాకారులు శ్రీ ఆర్.కె.శ్రీరామ్‌కుమార్(వయొలి
మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఎస్వీ సంగీత కళాశాల వయొలిన్ విభాగం విద్యార్థులు తమ వాయిద్య పాటవాన్ని ప్రదర్శించారు. అనంతరం తిరుచ్చినాపల్లికి చెందిన శ్రీ టి.కె.వి.రామాను జాచార్యులు ప్రసంగిస్తూ పాతతరం, కొత్తతరం సంగీత విద్వాంసుల వాయిద్యశైలి విధానం, ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసుల ప్రదర్శనను విద్యార్థులకు వీడియో ద్వారా చూపారు. చివరిగా విద్యార్థులకు క్విజ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత కళాశాల వయొలిన్ విభాగాధిపతి శ్రీ కోమండూరి వెంకటకృష్ణ, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సెప్టెంబరు 8న వైజాగ్ సిస్టర్స్‌తో అన్నమాచార్య అష్టోత్తర శత సంకీర్తన గానయజ్ఞం
తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సెప్టెంబరు 8వ తేదీన తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య అష్టోత్తర శత సంకీర్తన గానయజ్ఞం జరుగనుంది. ఉదయం 7.00 గంటల నుండి రాత్రి 7.00 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమంలో వైజాగ్ సిస్టర్స్‌గా పేరొందిన కుమారి ఎన్‌సి.సాయి ప్రశాంతి, కుమారి ఎన్‌సి.సాయి సంతోషి 108 అన్నమాచార్య కీర్తనలను ఆలపించి వీనులవిందు చేయనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.