సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలకు దరఖాస్తు గడువు పెంపు
సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలకు దరఖాస్తు గడువు పెంపు
తిరుపతి, ఆగస్టు 22, 2013: తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న 31వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును సెప్టెంబరు 7వ తేదీ వరకు పెంచారు. దరఖాస్తుల సమర్పణకు మొదట ఆగస్టు 17వ తేదీని తుదిగడువుగా నిర్ణయించారు. విద్యార్థుల స్పందనను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 7వ తేదీకి తుది గడువును పెంచారు. 6, 7వ తరగతుల విద్యార్థులకు ధర్మపరిచయం, 7, 8, 9వ తరగతుల విద్యార్థులకు ధర్మప్రవేశిక అనే పేర్లతో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష రుసుం 5 రూపాయలు మాత్రమే. ఎస్.సి, ఎస్.టి మరియు వికలాంగులైన విద్యార్థులకు పరీక్ష రుసుం లేదు. వీరు అందుకు సంబంధించిన ధ్రువీకరణపత్రం కాపీ దరఖాస్తుతో పాటు తప్పక జతపరచాల్సి ఉంటుంది. కనీసం 50 మంది అభ్యర్థులుంటే ఆ పాఠశాల కేంద్రంగా పరీక్షలు నిర్వహిస్తారు. మారిన కొత్త సిలబస్ పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందజేస్తారు. దరఖాస్తులు ” కార్యదర్శి, హిందూ ధర్మ ప్రచార పరిషత్, తి.తి.దేవస్థాన ములు, పాత హుజూర్ ఆఫీసు, తిరుపతి-517501” నుండి ఉచితంగా పొందవచ్చు.
–
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.