సమాజంలో తెలుగు ఉపాధ్యాయులకు ఉన్నత స్థానం : తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాధ్‌

సమాజంలో తెలుగు ఉపాధ్యాయులకు ఉన్నత స్థానం : తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాధ్‌

తిరుపతి, 2012 ఆగస్టు 19: తెలుగు సాహిత్యాన్ని బోధించే ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ సమాజంలో ఉన్నత స్థానం ఉంటుందని తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాధ్‌ అన్నారు. దానికి తగ్గట్టుగానే తెలుగు ఉపాధ్యాయులు పురాణ, ఇతిహాసాల్లోని ధర్మాన్ని బోధించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, పావని సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ఆదివారం ముగిసింది.

ముగింపు కార్యక్రమంలో తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాధ్‌ మాట్లాడుతూ ఇతర పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయుల కంటే తెలుగు పండితులనే విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడతారన్నారు. తెలుగు అమ్మభాష కావడమే దీనికి కారణమన్నారు. రెండు రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

అనంతరం ప్రముఖ పండితులు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఆచార్య సలాక రఘునాథశర్మ ప్రసంగిస్తూ మానవులు ధర్మస్వరూపం కావాలంటే వేద విజ్ఞానం అవసరమన్నారు. వేద విజ్ఞానం కావాలంటే రామాయణం, మహాభారతం గ్రంథాలను తప్పక చదవాలన్నారు.
రామాయణాన్ని రచించిన వాల్మీకి, మహాభారతాన్ని రచించిన వ్యాసుడు రుషులతో సమానమని, ఆ గ్రంథాల రచనను వారు తపస్సుగా భావించారని అన్నారు. ఉపాధ్యాయులు ఈ గ్రంథాల్లోని సారాన్ని విద్యార్థులకు బోధించి ధర్మ రక్షణకు కృషి చేయాలని కోరారు.

పావని సేవా సమితి ప్రతినిధి శ్రీ ముత్యాల నాయుడు ప్రసంగిస్తూ విద్యార్థుల్లో మానవతా విలువలను పెంపొందించడమే తమ సంస్థ ప్రధాన ధ్యేయమన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థులకు పలు నీతి శతకాలను పరిచయం చేసి పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తమ ప్రయత్నానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగు ఉపాధ్యాయులు సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి,  పావని సేవా సమితి వ్యవస్థాపకులు శ్రీ చల్లా సాంబిరెడ్డి, రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన 300 మందికిపైగా తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.