సీతంపేటలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

సీతంపేటలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

– మే 4న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం

సీతంపేట, 2023 ఏప్రిల్ 29: పార్వతీపురం మన్యం జిల్లా  సీతంపేటలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మే 4న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

శనివారం సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆచార్యవరణం, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం చేపట్టారు.

ఏప్రిల్ 30న ఉదయం 8 నుండి 11 గంటల వరకు పంచగవ్యప్రాసన, వాస్తు హోమం, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు అగ్ని ప్రతిష్ట, కుంభ స్థాపన, కుంభారాధన, విశేష హోమం నిర్వహిస్తారు.

మే 1న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, అక్షిన్మోచనం, నవకలశ స్నపనం, పంచగవ్యాధివాసం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు.

మే 2న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, క్షీరాధివాసం, నవకలశ స్నపనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు.

మే 3న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, జలాధివాసం, రత్నన్యాసం, ధాతున్యాసం, విమాన కలశ స్థాపన బింబస్థాపన(విగ్రహప్రతిష్ట), సాయంత్రం మహాశాంతి తిరుమంజనం, రాత్రి శయనాధివాసం నిర్వహిస్తారు.

మే 4న ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.