అలహాబాదు త్రివేణి సంగమం వద్ద శ్రీవారి నమూనా ఆలయం : తితిదే ఈఓ 

అలహాబాదు త్రివేణి సంగమం వద్ద శ్రీవారి నమూనా ఆలయం : తితిదే ఈఓ

తిరుపతి, జనవరి 05, 2013: జనవరి 14 నుండి మార్చి 10వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అలహాబాదులోని త్రివేణి సంగమం వద్ద జరుగనున్న కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం నిర్మించి నిత్య కైంకర్యాలు చేపట్టనున్నట్టు తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ఉన్న ఈఓ కార్యాలయంలో శనివారం ఉదయం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ జనవరి 27వ తేదీ నుండి తితిదే అధికారులు కుంభమేళాలో పాల్గొంటారని తెలిపారు. ఉత్తరాది భక్తులకు శ్రీవారి వైభవాన్ని తెలిపేలా నమూనా ఆలయ ప్రాంగణంలో కల్యాణోత్సవాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఆలయం మొత్తం పుష్పాలంకరణ చేపట్టాలని, అన్నప్రసాదాలు, వివిధ భాషల్లో పుస్తక ప్రసాదం పంపిణీ చేయాలని, ఆలయ వైభవాన్ని తెలిపేలా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో డాక్యుమెంటరీలు ప్రసారం చేయాలని ఆదేశించారు.
 
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి జెఈఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.