ఘనంగా శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 33వ వర్ధంతి

ఘనంగా శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 33వ వర్ధంతి

తిరుపతి, సెప్టెంబరు 10, 2013: తితిదేలో శాసన అధ్యయనకారుడిగా పనిచేసి శ్రీవారి వైభవాన్ని, చరిత్రను యావత్‌ ప్రపంచానికి అందించిన శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 33వ వర్ధంతిని మంగళవారం తిరుపతిలోని శ్వేత భవనంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉదయం 10.00 గంటలకు శ్వేత భవనం ముందున్న సుబ్రమణ్యశాస్త్రి కాంస్య విగ్రహానికి తితిదే అధికారులు పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తితిదే సివిఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ దేవస్థానం ఉద్యోగిగా మాత్రమే కాకుండా శాసన అధ్యయనకారుడిగా స్వామివారి వైభవాన్ని మొట్టమొదట చాటిచెప్పిన ఘనత శ్రీమాన్‌ సాధు సుబ్రమణ్యానిదే అన్నారు. ఇలాంటి వ్యక్తులు ఉద్యోగులందరికీ స్ఫూర్తిదాయకమని, వారిని స్మరించుకోవడమంటే స్వామివారిని సేవించుకోవడమేనని చెప్పారు.
శ్వేత సంచాలకులు డాక్టర్‌ కె.వి.రామకృష్ణ మాట్లాడుతూ శాస్త్రిగారు ఆలయ పేష్కారుగా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా 1167 రాగిరేకుల శాసనాలను అనువదించారని, అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా కీర్తనలను వెలుగులోకి తెచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్వేత సూపరింటెండెంట్‌ శ్రీ పి.ఆనంద్‌, శ్వేత సిబ్బంది, తితిదే ఉద్యోగులు పాల్గొన్నారు.
             
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది