తితిదే ఎల్లప్పుడు మీడియాతో మంచి సంబంధాలు కోరుకుంటున్న‌ది 

తితిదే ఎల్లప్పుడు మీడియాతో మంచి సంబంధాలు కోరుకుంటున్న‌ది

తిరుపతి, 2010 అక్టోబర్‌ 05 : అక్టోబర్‌ 5వ తేదిన తితిదే పరిపాలనా భవనంలో బిసి కమీషన్‌వారిచే రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఏవిధంగా పాటిస్తున్నారు అన్నవిషయమై కార్యాలయంలో రికార్డుల పరిశీలన జరిగింది. అదేవిధంగా ఇటీవల ఉద్యోగాలకై ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుచున్నది.

ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు కొంతమంది మీడియా ఫోటోగ్రాఫర్లు పరిపాలనా భవనంలోనికి వెళ్ళడానికి ప్రయత్నించగా అధికారుల అనుమతి తీసుకోండి పంపుతామని సెక్యూరిటీగార్డులు వారికి తెలియజేయడమైనది. ఈ సమయంలో పరిపాలనా భవనంలోకి వెళ్ళిన ప్రజాసంబంధాల అధికారి మీడియా పక్షాన జెఇఓతో చర్చించగా బిసి కమీషన్‌ చైర్మన్‌ అనుమతి తీసుకోవాలన్నారు.

అయితే తితిదే డిప్యూటీ ఇఓ (జనరల్‌) బిసి కమీషన్‌ చైర్మన్‌ గారిని మీడియా అనుమతికై కోరగా వారు ప్రస్తుతం సమావేశంలో వున్నానని సాయంత్రం 4 గంటలకు శ్రీ పద్మావతి అతిధిగృహమునందు ప్రెస్‌తో మాట్లాడుతానని తెలిపారు. అదేవిధంగా నిరుద్యోగ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుచున్నప్పుడు మీడియాను అనుమతించడం మంచిదికాదనే ఉద్దేశ్యంతో జెఇఓ మీడియాకు నచ్చచెప్పమని పిఆర్‌ఓకు తెలిపారు. ఇదే విషయమై మీడియా మిత్రులకు తెలియజేయగా, వారు ససేమిరా అనడమేగాక, లోపలికి అనుమతించాలని కోరారు.

బిసి కమీషన్‌వారు మీడియాను కలవలేమని చెప్పినందున, మీడియాను లోపలికి అనుమతించడం సబబుగా వుండదనే ఉద్దేశ్యంతోనే తితిదే ఫోటోగ్రాఫర్‌తో ఫోటోలు తీయించి మీడియాకు విడుదల చేస్తామని మీడియా మిత్రులకు సవినయంగా తెలియజేశాం.

అంతేగాక ఈ విషయమై పిఆర్‌ఓతో పాటు అదనపు ముఖ్య భద్రతాధికారి, తితిదే యూనియన్‌ నాయకులు అంతా మీడియా మిత్రులను ప్రాధేయపడడం జరిగిరది. అయిననూ వారు పరిపాలనా భవనం ముందు ధర్నాను కొనసాగించడం జరిగింది. వాస్తవానికి వారం క్రింతం ఇఓతో మీడియా మిత్రులతో చర్చల సందర్భంగా పరిపాలనా భవనంలోకి వెళ్ళేప్పుడు ఆయా విభాగానికి సంబంధించిన విషయమై సంబంధిత హెచ్‌ఒడితో ముందుగా మాట్లాడి లోనికి వెళ్ళాల్సిందిగా ఇఓ గారు స్పష్టం చేయడం జరిగిరది. అంతేగాక మీడియా మిత్రులు స్వీయనియంత్రణ విషయమై కొన్ని విధివిధానాలు తయారుచేసి ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై మీడియా మిత్రులు నుండి స్పందన లేదు.

తితిదే ఎల్లప్పుడు మీడియాతో సుహృద్భావ వాతావరణంలో మెరుగైన సంబంధాలు కోరుకుంటున్న విషయం మీకు విధితమే. అదేవిధంగా మీడియా సైతం తితిదేతో మంచి సంబంధాలు కల్గియున్నారనేది వాస్తవం. అయితే పరిపాలనా కారణాల వలన తితిదే పరిపాలనా భవనంలోనికి వెళ్ళనివ్వలేదనే చిన్న కారణంతో సాయంత్రం వరకు ధర్నా చేయడం, ప్రముఖ ధార్మికసంస్థకు వ్యతిరేకంగాను, అధికారులను విమర్శిస్తూ నినాదాలు చేయడం, సిబ్బందిని కార్యాలయం లోనికి వెళ్ళకుండా అడ్డుకోవడం, చివరకు పరిపాలనా భవనం అద్దాలు పగులగొట్టడం చాలా బాధాకరం అని తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా తితిదే ఎల్లప్పుడు మీడియాతో మంచి సంబంధాలు కోరుకుంటున్నదని, మీడియా మిత్రులు కూడా తితిదేకు పూర్తిగా సహకరించాల్సిందిగా మనవి చేస్తున్నాం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.