శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా వరలక్ష్మీవ్రతం

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా వరలక్ష్మీవ్రతం

 తిరుపతి, ఆగస్టు 16, 2013: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం వరలక్ష్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిజిపి శ్రీ దినేష్‌రెడ్డి, తితిదే ధర్మకర్తల మండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు దంపతులు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్‌ దంపతులు పాల్గొన్నారు.

వరలక్ష్మీవ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కుంకుమార్చన, మంగళహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా తితిదే పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ తిరుమలాచార్యులు వ్రతం విశిష్టతను తెలియజేశారు. శ్రావణపూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీవ్రతం ఆచరించాలని, ఈ వ్రతం చేసిన మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్య సౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న భక్తులకు విశేషమైన ఫలితం సిద్ధిస్తుందని ఆయన తెలిపారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 5.00 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను తితిదే రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ఆలయ ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ భాస్కర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.