సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 2 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు

సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 2 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు

తిరుపతి, సెప్టెంబరు 13, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 29న అంకురార్పణంతో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సెప్టెంబరు 29వ తేదీన అంకురార్పణం సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం నిర్వహిస్తారు. సెప్టెంబరు 30న యాగశాలలో పవిత్రప్రతిష్ఠ నిర్వహించి స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం జరుగుతాయి. అక్టోబరు 1న ఉదయం స్నపనతిరుమంజనం అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పిస్తారు. అక్టోబరు 2న ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి ఈ పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది