తితిదే స్థానిక ఆలయాల్లో వైభవంగా రథసప్తమి

తితిదే స్థానిక ఆలయాల్లో వైభవంగా రథసప్తమి

తిరుపతి, ఫిబ్రవరి 17, 2013: తితిదేకి అనుబంధంగా ఉన్న తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని ఆదివారం రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లు ఒకేరోజు ఒకేరోజు ఏడు వాహనాలపై విహరించడంతో ఆ వైభవాన్ని కనులారా తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో..
 
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీ గోవిందరాజస్వామివారి వాహన సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం హంస, హనుమంత, పెద్దశేష వాహనాలపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు. మధ్యాహ్నం ముత్యపుపందిరి, సర్వభూపాల వాహనాలపై స్వామివారి ఊరేగింపు సాగింది. రాత్రి 7.30 నుండి 9.00 వరకు గరుడవాహంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారు.
 
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో..
 
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ సముదాయంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఉదయం 6.00 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు.
 
అనంతరం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉదయం 7.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు అమ్మవారు పెద్దశేష, సింహ, అశ్వ, గరుడ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. అనంతరం తిరుచ్చి ఉత్సవం జరిగింది. సాయంత్రం 6.15 నుండి 7.15 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహనాలను అధిరోహించి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
 
శ్రీనివాసమంగాపురంలో..
 
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం మొట్టమొదటి సారిగా రథసప్తమి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు తిరుచ్చిపై స్వామివారు దేవేరులతో కలసి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కర్పూరహారతులు సమర్పించారు.
 
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ప్రచార రథం ప్రారంభం వచ్చే మార్చి ఒకటి నుండి తొమ్మిదో తేదీ వరకు జరుగనున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేసేందుకు ఆదివారం సాయంత్రం తితిదే అధికారులు ప్రచార రథాన్ని ప్రారంభించనున్నారు. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ ప్రచార రథం తిరుపతి, పరిసర మండలాల్లోని గ్రామాల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే వరకు పర్యటించనుంది. ఇందులో భజన బృందాల సభ్యులు వెళ్లి భక్తులను ఆహ్వానించనున్నారు.
 
అదేవిధంగా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నారాయణవనం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణు గోపాలస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయాల్లో స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగి భక్తులకు కనువిందు చేశారు.
 
ఈ కార్యక్రమాల్లో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారులు శ్రీ గోపాలకృష్ణ, శ్రీమతి రెడ్డెమ్మ, శ్రీ చంథ్రేఖరపిళ్లై, సహాయ కార్యనిర్వహణాధికారులు శ్రీ వేణుగోపాల్‌, శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికార ప్రముఖులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.