ANKURARPANAM _ వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Local Temples DyE.O Sri Chandrasekhar Pillai and large number of devotees took part in this function.
వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, మార్చి 10, 2013: మార్చి 11 నుండి 19వ తేదీ వరకు జరుగనున్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది.
ఉదయం సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు అభిషేకం, తోమాల సేవ, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం వేదప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి 7.15 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం ఘనంగా జరుగనుంది. రాత్రి 7.15 నుండి 8.30 గంటల వరకు అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించారు.
కాగా సోమవారం ఉదయం 10.10 నుండి 10.30 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి.
వైభవంగా శ్రీవారి పాదపద్మముల శోభాయాత్ర బ్రహ్మోత్సవాల్లో శ్రీ కోదండరామస్వామివారికి అలంకరించేందుకు తిరుమల శ్రీవారి ఆలయం నుండి తీసుకొచ్చిన స్వామివారి పాదపద్మాల శోభాయాత్ర ఆదివారం సాయంత్రం కోలాహలంగా జరిగింది. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, డప్పువాయిద్యాల మధ్య తిరుపతి నగర వీధుల్లో శోభాయాత్ర సాగింది.
ముందుగా తిరుమల శ్రీవారి ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నంగారి రమణ తిరుమల నుండి శ్రీవారి పాదపద్మాలను అలిపిరి పాదాలమండపం వద్దగల శ్రీ లక్ష్మీ నారాయణస్వామివారి సన్నిధికి తీసుకొచ్చారు. అక్కడి నుండి తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి శ్రీవారి పాదపద్మాలను శిరస్సుపై ఉంచుకుని శోభాయాత్రగా శ్రీ కోదండరామాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి అలంకరించేందుకు తిరుమల శ్రీవారి ఆలయం నుండి పాదపద్మాలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సాక్షాత్తు తిరుమల శ్రీవారికి అలంకరించే పాదపద్మాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొన్నట్టు తెలిపారు. ఈ ఆనవాయితీని కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. కాగా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో తిరుపతి నగరవాసులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
అలిపిరి పాదాలమండపం వద్ద నుండి ప్రారంభమైన శోభాయాత్ర ఎస్వీ మెడికల్ కళాశాల, పాత మెటర్నిటీ ఆసుపత్రి సర్కిల్(కోమలమ్మ సత్రం) మీదుగా శ్రీ కోదండరామాలయానికి చేరుకుంది. ఆలయ నాలుగు మాడవీధుల్లో ప్రదక్షిణ చేసిన అనంతరం అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం శోభాయాత్రకు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, విజిఓ శ్రీ హనుమంతు, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీ సుధాకరరావు, హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ రఘునాధ్, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.