నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ

నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, 2017 నవంబరు 14: టిటిడి అనుబంధ ఆలయమైన నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాలలో భాగంగా నవంబరు 15వ తేదీ బుధవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరగనుంది. ఇందులో పాలు, పెరుగు, తేనే, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం నిర్వహిస్తారు.

అనంతరం ఉదయం 11.30 గంటలకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 5.00 గంటలకు వీధిఉత్సవం జరగనుంది. రాత్రి 9.00 గంటలకు పూర్ణాహుతిలో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.