ఘనంగా అన్నమయ్య జయంతి ఉత్సవాలు


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా అన్నమయ్య జయంతి ఉత్సవాలు

తిరుపతి, 2018 మే 3: తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 610వ జయంతి ఉత్సవాలు గురువారం ఐదో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులు శ్రీ ఏ. రాజమోహన్‌, శ్రీ ఆర్‌.శ్యాంకుమార్‌, శ్రీఎం. మోహన్‌, శ్రీ కె.సుబ్రమణ్యం నిర్వహించిన గాత్ర సంగీత కార్యక్రమానికి విశేషస్పందన లభించింది. ”నగవులు నిజమని నమ్మెదా…., ఎంత మాత్రమున ఎవ్వరూ తలచిన….., భావములోన భాష్యంనందున…, పలుకు తేనెల….నారాయణాయా తగునా బ్రహ్మణే” తదితర కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు.

సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు వరంగల్‌కు చెందిన కుమారి టి. సుష్మ, టి. సుష్మిత గాత్రకార్యక్రమం, రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు కూచిపూడికి చెందిన డా. చింతా రవి బాలకృష్ణ బృందం నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు చెన్నైకి చెందిన కుమారి. ఎం.పి. శ్రుతి రవళి బృందం గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.

ఆ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీ ధనుంజయులు, ఏఈవో శ్రీమతి శాంతి, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ రీసెర్ట్‌ అసిస్టెంట్‌ శ్రీమతి లత ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.