తిరుమలకు పోటెత్తిన భక్తులు-నిరంతరాయంగా టి.టి.డి అన్నప్రసాద సేవలు

తిరుమలకు పోటెత్తిన భక్తులు-నిరంతరాయంగా టి.టి.డి అన్నప్రసాద సేవలు

అక్టోబరు 02, తిరుమల 2017: శ్రీవారి దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. సెప్టెంబర్‌ 30వ తేది పెరటాశి రెండో శనివారం, అక్టోబర్‌ 1వ తేది ఆదివారం, అక్టోబర్‌ 2వ తేది మహాత్మాగాంధీ జయంతి నేపథ్యంలో వరుసగా రెండు రోజులు సెలవులు కలిసిరావడంతో తిరుమలకు అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, లడ్డూ కౌంటర్లు, క్యూలైన్లు దాటి భక్తుల రద్దీ అనూహ్యంగా కనబడింది.

భక్తులకు అందుతున్న సేవలపై ఎప్పటికప్పుడు వేరువేరుగా సీనియర్‌ అధికారులు టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, అన్నప్రసాదం డిప్యూటి ఈవో శ్రీ వేణుగోపాల్‌, క్యాటరింగ్‌ అధికారి శ్రీ జి.ఎల్‌.ఎన్‌ శాస్త్రీ, వసతి విభాగం డిప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్‌, ఆరోగ్యవిభాగం అధికారి డా. శర్మిష్ఠ, ఇతర శాఖల అధికారులు పర్యవేక్షించారు. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, పుడ్‌కోర్టులు, భక్తులు రద్దీ ఉన్న పలు ప్రాంతాలు, క్యూలైన్లలో వేచివున్న భక్తులకు క్రమం తప్పకుండా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, కాఫీ సదుపాయాన్ని నిరంతరాయంగా అందిస్తున్నారు. శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.