ANNUAL PUSHPA YAGAM IN SRI KALYANA VENKATESWARA SWAMY TEMPLE _ నేత్రపర్వంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడి పుష్పయాగం
నేత్రపర్వంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడి పుష్పయాగం
తిరుపతి, ఏప్రిల్ 05, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం పుష్పయాగం నేత్రపర్వంగా జరిగింది. ఇటీవల శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో ఏవైనా పొరబాట్లు దొర్లి ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 16 రకాలకు చెందిన ఆరు టన్నుల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. మొత్తం వెయ్యి మందికి పైగా భక్తులు ఈ యాగంలో పాల్గొన్నారు. రూ.516/- చెల్లించి ఈ యాగంలో పాల్గొన్న గృహస్తులకు(ఇద్దరు) రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేశారు. కాగా సాయంత్రం 6.00 గంటలకు ఊంజల్‌సేవ, రాత్రి 7.00 గంటలకు వీధి ఉత్సవం జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం దంపతులు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారులు శ్రీ గోపాలకృష్ణ, శ్రీమతి రెడ్డెమ్మ, బోర్డు సెల్ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ రఘునాధ్, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది