AP CM TO INAUGURATE SEVERAL DEVELOPMENT ACTIVITIES ON OCTOBER 11-TTD EO _ అక్టోబ‌రు 11న శ్రీ‌వారికి ముఖ్య‌మంత్రి ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌

TIRUMALA, 01 OCTOBER 2021: The Honourable CM of AP Sri YS Jaganmohan Reddy will participate and inaugurate several TTD development activities on October 11th on the occasion of Garuda Seva said TTD EO Dr KS Jawahar Reddy.

 

Speaking to media persons after Dial your EO program outside Annamaiah Bhavan at Tirumala on Friday, the EO said the Honourable CM will offer silk vastrams on the day of Garuda Seva on October 11 as a part of Srivari annual Brahmotsavam which will be performed in Ekantham from October 7 to15.

 

On that day, CM will inaugurate the Go-Mandiram set up with a donation of Rs.15 crore offered by Sri Sekhar Reddy from Chennai, which includes facilities for Go-pradakshina, Go- Tulabharam and displays highlighting the significance of Gomata.

 

Apart from this at Tirumala CM will inaugurate a new boondi making kitchen complex built with a donation of Rs.2 crore by Sri N Srinivasan of India cements.

 

Among others, Chief Minister will also inaugurate the new paediatric hospital built in the BIRRD hospital complex set up on his directions for which civil works completed and all equipment are procured.

 

CM will also inaugurate the SVBC Kannada and Hindi channels. The  Honourable CM of Karnataka may also take part in this event. The Diaries and Calendars will also be released by our CM on the occasion.

 

Giving clarity on safety measures, the EO said in view of the health safety of devotees the Slotted Sarva Darshan free tokens are being issued in online from September 25 onwards. All devotees who have booked darshan tickets have to come with certificates of 2 doses of vaccination or a 3 day old Covid positive test which is mandatory.

 

If the situation turns to normalcy by this month-end, we will think of issuing SSD tokens in off-line by November. 

 

On Agarbattis the EO said there is a huge response to the seven brands of agarbattis brought out by the TTD symbolic of the Seven Hills of Tirumala. An MoU with Dr YSR horticultural university has also been entered Dry flower technology and  TTD will manufacture artefacts including Divine Portraits of Srivaru and Ammavaru, paperweights and key chains from used flowers of all TTD sub-temples which will be released by December or Vaikunta Ekadasi.

 

The Alipiri footpath which has been refurbished with concrete rooftop shades and other facilities accomplished by the Reliance Company at a cost of over Rs. 25 crore will also be ready for Pilgrims during the  Brahmotsavams.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 11న శ్రీ‌వారికి ముఖ్య‌మంత్రి ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌
 
– ఎస్వీబీసీ క‌న్న‌డ‌, హిందీ ఛాన‌ళ్ల‌తోపాటు ప‌లు ప్రారంభోత్స‌వాలు
 
– డిసెంబ‌రులో అందుబాటులోకి ఆయుర్వేద గృహావ‌స‌రాల ఉత్ప‌త్తులు
 
– జాతీయ స్థాయిలో తిరుమ‌ల మ్యూజియం అభివృద్ధి ప‌నులు
 
–  డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి
 
తిరుమల, 01 అక్టోబ‌రు 2021: శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో అక్టోబరు 11న గరుడసేవ నాడు ముఖ్యమంత్రి గౌ. శ్రీ వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తార‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. అదే రోజు ఎస్వీబీసీ క‌న్న‌డ‌, హిందీ ఛాన‌ళ్ల‌తోపాటు ప‌లు ప్రారంభోత్స‌వాలు చేస్తార‌ని చెప్పారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సంద‌ర్భంగా ఈవో వెల్ల‌డించిన వివ‌రాలు ఇవి.
 
శ్రీవారి సాలకట్ల  బ్రహ్మోత్సవాలు  :
 
– శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబరు 7 నుండి 15వ తేదీ వరకు 9 రోజుల పాటు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నాం. అక్టోబరు 5న కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం, అక్టోబరు 6న అంకురార్పణ, అక్టోబరు 7న ధ్వజారోహణం, అక్టోబరు 11న గరుడవాహనం, అక్టోబరు 12న సాయంత్రం స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనం, అక్టోబరు 14న ఉదయం రథోత్సవానికి బదులుగా సర్వభూపాలవాహనం, అక్టోబరు 15 ఉదయం చక్రస్నానం (అయిన మహల్‌లో) – రాత్రి ధ్వజావరోహణం, అక్టోబరు 16న శ్రీవారి భాగ్‌సవారీ ఉత్సవం జ‌రుగ‌నున్నాయి.
 
ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా ప్రారంభోత్స‌వాలు
 
– అక్టోబరు 11న గరుడసేవ నాడు ముఖ్యమంత్రి గౌ. శ్రీ వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అదే రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు.
 
– అలిపిరి పాదాల మండపం వద్ద చెన్నైకి చెందిన దాత శ్రీ శేఖర్‌రెడ్డి విరాళంతో నిర్మిస్తున్న గోమందిరాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో గోప్రదక్షిణ, గోతులాభారం, గోవు ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
 
– అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారి పైకప్పును రిలయన్స్‌ సంస్థ రూ.25 కోట్ల విరాళంతో పునఃనిర్మించిన మార్గాన్ని రాబోయే బ్రహ్మోత్సవాలలో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తాం.
 
– తిరుమలలో ఇండియా సిమెంట్స్‌ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందిపోటును అందుబాటులోకి తీసుకువస్తాం.
 
– ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చిన్నపిల్లల కోసం తిరుపతిలోని బర్డ్‌ ఆసుపత్రి పాత బ్లాక్‌లో పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి తాత్కాలిక భవన నిర్మాణపనులు పూర్తయ్యాయి.  ఇందుకు సంబంధించి యంత్ర పరికరాలు ఇతర వసతులు దాదాపుగా పూర్తయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబరు 11వ తేదీన ముఖ్యమంత్రి చేతులమీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం.
 
బ‌ర్డ్‌
 
– బర్డ్‌ ఆసుపత్రికి దాతలు కోట్లాది రూపాయల విలువైన పరికరాలు విరాళంగా అందించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్లు, ఆర్థోపెడిక్‌ డాక్టర్లు స్వచ్ఛందంగా విజిటింగ్‌ కన్సల్టెంట్లుగా ఓపిలు, అరుదైన ఆప‌రేష‌న్లు నిర్వ‌హిస్తున్నారు. వీరంద‌రికీ కృత‌జ్ఞ‌తలు.
 
– టిటిడి ముద్రించిన 2022 – డైరీలు, క్యాలెండర్లను బ్రహ్మోత్సవాలలో తిరుమల, తిరుపతిలలోని అన్ని టిటిడి ప్రచురణల విక్రయశాలల్లో భక్తులకు అందుబాటులో ఉంచుతాం.
 
సర్వదర్శనం టోకెన్లు
 
– భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సెప్టెంబ‌రు 25వ తేదీ నుండి ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్ల విడుదల చేశాం.
 
– శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వ్యాక్సిన్‌ వేయించుకున్న సర్టిఫికెట్‌ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు ఆర్‌టిపిసిఆర్ కరోనా పరీక్ష చేయించుకుని నెగిటివ్‌ సర్టిఫికెట్‌ గానీ తప్పనిసరిగా తీసుకురావాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను.
 
– శ్రీవారి సప్తగిరులకు సూచికగా ఏడు బ్రాండ్లతో సెప్టెంబ‌రు 13న అగరబత్తులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చాం. వీటికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. డిమాండ్‌కు త‌గినంత ఉత్ప‌త్తి పెంచాల్సిన అవ‌స‌ర‌ముంది.
 
డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఎంఓయు
 
– వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో స్వామి, అమ్మవార్ల ఫోటోలు, క్యాలెండర్లు, డ్రైఫ్లవర్‌ మాలలు, తదితరాలు తయారు చేయడానికి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఎంఓయు కుదుర్చుకున్నాం. రాబోవు రెండు, మూడు నెలలో భక్తులకు అందుబాటులోకి తెస్తాం.
 
గుడికో గోమాత
 
–      హిందూ ధర్మాన్ని విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించాం. దేశంలో భక్తులు ఏ ఆలయానికి వెళ్లినా గోపూజ చేసుకునే ఏర్పాటు చేయడానికి టిటిడి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా తిరుప‌తిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో ఇటీవ‌ల గోపూజను ప్రారంభించాం. త్వరలో తిరుప‌తిలోని అన్ని ఆల‌యాల్లో గోపూజ సేవ అందుబాటులోకి వస్తుంది.
 
గో ఆధారిత ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం
 
–   శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం, కూరగాయలు, బెల్లం, పప్పుదినుసులతో తయారు చేసిన అన్నప్రసాదాలను ఈ ఏడాది మే 1వ తేదీ నుండి నిత్య నైవేద్యంగా సమర్పిస్తున్నాం. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగేందుకు ప‌లువురు దాతలు ముందుకొస్తున్నారు. ఈ ఆలోచ‌న నుంచే న‌వ‌నీత సేవ కార్య‌క్ర‌మం పుట్టింది.
 
నవనీత సేవ
 
–   దేశీయ గోవుల పాలతో తయారుచేసిన పెరుగును చిలికి వెన్న తయారుచేసి, తిరుమల శ్రీవారికి సమర్పించేందుకు ఆగస్టు 30న కృష్ణాష్టమి పర్వదినం నుంచి నవనీత సేవను ప్రారంభించాం. భక్తులు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తున్నాం. ఇందుకోసం భక్తుడు తిరుమల గోశాలకు రాజస్థాన్‌ నుండి గిర్‌ గోవులను తెప్పించి విరాళంగా ఇచ్చారు.  
 
గోసంరక్షణ
 
–   టిటిడి ఆధ్వర్యంలోని తిరుమల, తిరుపతి, పలమనేరు గోశాలలను అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించాం. పాలిచ్చే ఆవుల సంత‌తిని పెంచి తిరుమ‌ల శ్రీ‌వారి నైవేద్యానికి కావాల్సిన నెయ్యి ఇక్క‌డినుంచే త‌యార‌య్యే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. దాత‌లు ముందుకొచ్చి గిర్ ర‌కానికి చెందిన దేశీయ గోవుల‌ను విరాళంగా ఇచ్చారు. దీంతో పాటు ఒంగోలు, రెడ్ సింధీ, సాహ్నివాల్ లాంటి దేశీయ జాతుల ఆవులను స్వీక‌రించి పాల ఉత్ప‌త్తిని పెంచుతాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో చ‌క్క‌గా ప‌నిచేస్తున్న గోశాల‌ల‌కు స‌హ‌కారం అందించే ప్ర‌ణాళిక త‌యారు చేస్తున్నాం.
 
గో ఆధారిత వ్య‌వ‌సాయం
 
–   గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్ర‌కృతి వ్య‌వ‌సాయ విభాగంతో అనుసంధానం చేసుకుని రైతుల నుండి టిటిడికి అవ‌స‌ర‌మైన 7 వేల ట‌న్నుల శ‌న‌గ‌ప‌ప్పును కొనుగోలు చేస్తాం. టిటిడి వ‌ద్ద ఉన్న పాలివ్వ‌ని ఆవులు, ఎద్దులను గో ఆధారిత వ్య‌వ‌సాయం చేసే రైతుల‌కు అందిస్తాం. గోమూత్రం, పేడ రైతుల‌కు ఎరువుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.
 
పంచగవ్య ఉత్పత్తులు
 
–   కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్‌ ఆయుర్వేద ఫార్మశీ సహకారంతో పంచగవ్య ఉత్పత్తుల్కెన సబ్బు, షాంపు, ధూప్‌ స్టిక్స్‌, ఫ్లోర్‌ క్లీనర్‌ లాంటి 15 రకాల ఉత్పత్తులను డిసెంబ‌రు మాసంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా, టిటిడి ఆయుర్వేద ఫార్మసీని బలోపేతం చేసి మరో 85 రకాల ఉత్పత్తులకు ఆయుష్‌ మంత్రిత్వశాఖ నుంచి లైసెన్స్‌ తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. మ‌రో నాలుగు నెల‌ల్లో పనులు పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొస్తాం.
 
తిరుమల ఎస్వీ మ్యూజియం
 
– తిరుమల ఎస్వీ మ్యూజియంలో శ్రీవారి వైభవాన్ని, చారిత్రక ప్రాశస్త్యాన్ని, వివిధ కాలాల్లో పలువురు చక్రవర్తులు, రాజులు, సామంతులు, మంత్రులు మొదలైనవారు అందించిన అలనాటి గంగాళాలు, సంగీత పరికరాలు, శ్రీవారి ఆభరణాల నమూనాలు మొదలైనవాటిని భక్తులు సందర్శించేందుకు వీలుగా టాటా గ్రూప్‌, టెక్ మ‌హింద్ర, మ్యాప్ సిస్ట‌మ్ సంస్థ‌ల సహకారంతో ఏర్పాట్లు చేపడుతున్నాం. జాతీయ‌స్థాయిలో మ్యూజియంను తీర్చిదిద్ది భ‌క్తులు సంద‌ర్శించ‌గానే గొప్ప అనుభూతి క‌లిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏడాదిలో ఈ ప‌నులు పూర్తి చేస్తాం.
 
పుస్తక రూపంలోకి పురందర దాసుల కీర్తనలు
 
– కర్ణాటక రాష్ట్రానికి చెందిన హరిదాసుల సంకీర్తనలను దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా ‘‘సర్వస్వం’’ పేరుతో పుస్తక రూపంలోకి తేవాలని నిర్ణయించాం. ఇప్పటికే టిటిడి వద్ద ఉన్న కీర్తనలతో పాటు మరిన్ని కీర్తనలను సేకరించి, పరిష్కరించడానికి పండిత పరిషత్‌ను ఏర్పాటు చేశాం.
 
– ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు రికార్డు చేసిన 300 దాస సంకీర్తనలతో ‘‘దాస నమనం‘‘ పేరుతో కర్ణాటకలో పాటల పోటీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
 
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌
 
– అక్టోబ‌రు 11న బ్ర‌హ్మోత్స‌వాల గ‌రుడ సేవ రోజున ఎస్వీబీసి హింది, కన్నడ భాషలలో ప్ర‌సారాలు ప్రారంభిస్తాం.
 
– టిటిడి రికార్డు చేసిన 4 వేల అన్నమయ్య సంకీర్తనలకు బహుళ ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో  ‘‘అదివో …. అల్లదివో….’’ పేరుతో అన్నమయ్య పాటల పోటీల కార్యక్రమాన్ని ప్రారంభించాం. తిరుపతిలోని ఎస్వీబిసి కార్యాలయంలో తొలుత చిత్తూరు జిల్లా యువతకు అన్నమయ్య పాటల పోటీలకు ఎంపిక ప్రారంభమైంది.
 
– లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు శ్రీవారిని ప్రార్థిస్తూ సెప్టెంబరు 3 నుండి 18వ తేదీ వరకు 16 రోజుల పాటు షోడశదిన బాలకాండ పారాయణ దీక్ష నిర్వహించాం.
 
– తిరుమలలో సుందరకాండ, యుద్దకాండ పారాయణానికి భక్తుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇటీవల ప్రారంభించిన బాలకాండ, గరుడ పురాణం విశేష ఆదరణ చూరగొంటున్నాయి.
 
అయోధ్య కాండ పారాయణదీక్ష
 
– అక్టోబరు 21వ తేదీ నుండి 27 రోజుల పాటు ధర్మగిరి శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో అయోధ్య కాండ పారాయణదీక్ష నిర్వహిస్తాం.
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మ‌య్య‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.