పెద్దశేష వాహనంలో 4 ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పెద్దశేష వాహనంలో 4 ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

నవంబరు 16, తిరుపతి, 2017: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మూెత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం పెద్దశేష వాహనసేవలో 4 ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి కలిసి ఈ పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం గ్రంథ రచయితలను శ్రీవారి ప్రసాదం, శాలువతో ఘనంగా సన్మానించారు. ఆ పుస్తకాల గురించి సంక్షిప్త సమాచారం ఈ కింద తెలియజేస్తున్నాం.

తిరుమల తిరుపతి దేవస్థాన శాసనాలు – ఒక నివేదిక :

తిరుమలలోని స్వామి పుష్కరిణీతీరంలో శ్రీమహావిష్ణువు వేంకటేశ్వరస్వామిగా అవతరించిన తీరు తెన్నులను పురాణాలు వివరించాయి. తిరుమల ఆలయాన్ని గురించి తిరుపతి, తిరుచానూరు ఆలయాలను గురించి చారిత్రక దాఖలాలు స్వల్పంగా తెలిసిన కాలంలో టిటిడి పురావస్తుశాఖ అధికారిగా ఉన్న శ్రీ సాధుసుబ్రహ్మణ్య శాస్త్రి ఈ ఆలయాల శాసనాలను అధ్యయనం చేసి, వాటిని ఆంగ్లభాషలోకి అనువదించి ఏడు సంపుటాలుగా టిటిడి ద్వారా ముద్రించారు. ఈ శాసనాలలో నిక్షిప్తమై ఉన్న సాంస్క తిక, ధార్మిక, ఉత్సవ, పూజాదులనూ, చరిత్రలో వివిధ సామ్రాట్టులు, సామంతులు, సామాన్యులు స్వామివారికి చేసిన సేవా వివరాలను వెల్లడించే ఒక నివేదికను ఆంగ్లంలో తయారుచేసి 1929లో ప్రచురించారు. ఈ గ్రంథాన్ని ”తిరుమల తిరుపతి దేవస్థాన శాసనాలు – ఒక నివేదిక” పేరుతో డా|| కోరాడ రామక ష్ణ తెలుగులోకి అనువదించారు.

శ్రీ సద్గురు మలయాళస్వామి (ఆంగ్లానువాదము) :

కేరళరాష్ట్రంలోని ఎన్‌గండియూరు అనే గ్రామంలో నోట్టియమ్మ కరియప్ప అనే పుణ్యదంపతులకు జన్మించి, వేలప్ప అనే పేరుతో పెరిగిన శ్రీమలయాళస్వామివారు చిన్నతనంలోనే వైరాగ్యాన్ని పొంది సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తిరుమల పాపనాశనం సమీపంలోని గోగర్భం క్షేత్రంలో కఠోర తపమాచరించి సిద్ధిని పొందారు. తదుపరి మలయాళ దేశం నుండి వచ్చిన స్వామి కనుక మలయాళస్వామిగా ఖ్యాతి గాంచి తిరుపతి – శ్రీకాళహస్తి ప్రాంతాల నడుమన ఏర్పేడు అనే ప్రాంతంలో ఆశ్రమాన్ని స్థాపించి సంస్క త భాషాభివ ద్ధికి విశేషంగా క షి చేశారు. మరీ ముఖ్యంగా స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ బాలికల కొరకు ప్రత్యేకంగా పాఠశాలను స్థాపించారు. అనేక గ్రంథాలను రచించి వేలాది శిష్యులను తయారు చేశారు.

ఇంతటి మహానుభావుల జీవిత చరిత్రను తెలిపే గ్రంథమే ఈ సద్గురు మలయాళస్వామి. ఈ గ్రంథాన్ని టిటిడి ”బ్రహ్మమొక్కటే గ్రంథమాల” అనే శీర్షిక క్రింద అందిస్తోంది. ఈ గ్రంథాన్ని తెలుగులో డా|| సముద్రాల లక్ష్మణయ్య రాయగా డా|| పి.సత్యనారాయణ ఆంగ్లభాషలోకి అనువదించారు.

క్షేత్రయ్య :

భారతజాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేసే చక్కని సంస్క తికి మన చిన్నారులను వారసులుగా తీర్చిదిద్దే సంకల్పంతో ఆదర్శవంతులైన కొందరు మహాత్ముల జీవిత చరిత్రలను శ్రీనివాస బాలభారతి పేరుతో తెలుగులో 100కు పైగా పుస్తకాలను టిటిడి ముద్రించింది. వీటిని ఇంగ్లీషు, హిందీ భాషల్లో అనువదింపజేసి విశ్వవ్యాప్తం చేసింది.

శ్రీనివాస బాలభారతి గ్రంథమాలలో భాగంగా తెలుగులో శ్రీ ఐ.గురునాథరావు రాసిన ‘క్షేత్రయ్య’ అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో డా|| విశ్వేశ్వరరావు అనువదింపజేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ పుస్తకంలో క్షేత్రయ్య జీవిత చరిత్ర చక్కగా కథారూపంలో రాయబడింది.

వైద్య నైఘంటిక పద పారిజాతము :

భారతీయ వైద్యశాస్త్రానికి ఎంతో ప్రశస్తమైన చరిత్ర ఉంది. వైద్యాన్ని గురించి తెలిపే వాఙ్మయాన్ని మనపూర్వులు ఆయుర్వేదం అని పేర్కొన్నారు. వేద శబ్దంతో జోడించి పేర్కొనటం వల్ల వైద్యానికి ఉండే సముచితస్థానాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. వైద్యులను మన పూర్వులు సాక్షాత్తు నారాయణునిగా భావించారు. వైద్యోనారాయణో హరిః అనే ఆర్యోక్తిని మనం వింటుంటాం. దీనినిబట్టి శాస్త్రగ్రంథాలలో వైద్యశాఖకు ఉండే సముచితస్థానం తెలుస్తూ ఉంది.

వైద్యశాస్త్రానికి సంబంధించిన ప్రత్యేకపదాలు, సాంకేతికపదాలు, పారిభాషికపదాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ పదాలు – ఓషధులకు, ఔషధద్రవ్యాలకు, శరీరావయావాలకు, వ్యాధులకు సంబంధించినవి. అలాంటి అనేక వైద్యపదాల సముచ్ఛయాన్ని వివిధ వైద్యనిఘంటువుల నుండి సేకరించి ఆధునిక పాఠకులకు సులభంగా పదాన్ని గుర్తించి అర్థం చేసుకునే పద్ధతిలో అకారాను క్రమంగా నిఘంటువు తయారుచేశారు శ్రీగురజాడ శ్రీరామమూర్తి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.