COUNTRY’S PRIDE LIES IN SAFEGUARDING DHARMA-TTD EO _ తితిదే కార్యనిర్వహణాధికారి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగపాఠం

Tirupati, Aug 15: The pride of our country lies in upholding the values of Hindu Sanatana Dharma and TTD is the country’s one of the biggest 
Hindu religious organisations which has taken up the noble task of preserving, promoting and propagating the values of Hindu SanatanaDharma 
not only in the country but across the globe”, said TTD EO SriMG Gopal.
 
Addressing the employees of TTD on the occasion of the 67th Independence
Day celebrations on Thursday at the Parade Grounds in Tirupati after
flag hoisting ceremony, the EO said, TTD is committed to the cause of
protecting Hindu Dharma.
 
“Our sages, ancestors and predecessors taught us to lead life full of
ethics and human values by practising Hindu Sanatana Dharma. Thousands
of national leaders sacrificed their lives to get us independence. It
is now our turn to safe guard and protect the tenets of Hindu Sanatana
Dharma and walk in the path shown by our famous leaders”, he
maintained.
 
Listing out various pro-pilgrim and dharmic activites mulled by TTD,
the EO said on the pilgrim front TTD has been putting sincere efforts
to provide hassle free and comfortable darshan and stay to pilgrims
visiting Tirumala for darshan of Lord Venkateswara. “Even though the
APSRTC buses had halted their services in the Ghat section on 13th of
August due to bandh, we negotiated and convinced the union leaders to
resume plying of buses within 24hrs keeping in view the safety and
convenience of pilgrims”, he said
 
“Not only the religious and spiritual activities, but we have also
taken up several social welfare schemes for various sections of the
people living in the society including home for poor and destitue,
separate schools for deaf and dumb children, physically challenged,
free food, free hospital facilities etc.”, he added.
 
The EO also called upon the strong work force of TTD to see that the
top priority is given to protect the natural environs of the sacred
seven hills. “We have been performing rituals as per Agamas without
any deviations. We also aimed to develop the sub-temples of TTD on the
lines of Tirumala”, he said. “Let us take pledge on this auspicious
day that we will uphold our noble mission and dedicate ourselves in
the service of pilgrims”, he added.
 
JEOs Sri KS Srinivasa Raju, Sri P Venkatrami Reddy, CVSO Sri GVG Ashok
Kumar and other officials were also present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తితిదే కార్యనిర్వహణాధికారి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగపాఠం

తిరుపతి, ఆగస్టు 15, 2013: ”వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన” అని ప్రసిద్ధి చెందిన అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో స్వామివారి, అమ్మవార్ల కైంకర్యాలను నిర్వహిస్తున్న అర్చక, అర్చకేతర సిబ్బందికి మరియు కార్యనిర్వాహక, భద్రతా సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు, దేవస్థానంలో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు, భావిభారత నిర్మాతలైన విద్యార్థినీ విద్యార్థులకు, దేవస్థానం ధర్మకర్తల మండలి వారికి, శ్రీవారి భక్తిపారవశ్యంలో పునీతులౌతున్న భక్తులకు 67వ స్వాతంత్య్ర దినోత్సవ శుభసందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, వీరుల త్యాగఫలంగా, ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా ఈ స్వాతంత్య్రం సిద్ధించింది. ఈ శుభదినాన ఆ మహానుభావు లందరినీ స్మరించుకోవడం మన బాధ్యత. కనీస కర్తవ్యం. ఆర్ష సంస్కృతికి ఆలవాలమైన ఈ పుణ్యభూమిలో జన్మించడం, అందునా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైన ధార్మిక సంస్థలో పనిచేయడం మనందరి పూర్వజన్మ సుకృతం. అన్నింటికంటే ముందు రాష్ట్రంలోని, దేశంలోని స్వామివారి భక్తులకు తెలియజేయడం ఏమిటంటే ఈ నెల 13వ తేదీ తిరుపతి నుండి తిరుమలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు నిలిపివేసినప్పటికీ, భక్తుల అసౌకర్యాన్ని గుర్తించి నిన్నటి నుండి అనగా ఆగస్టు 14 నుండి భక్తుల రవాణాకు సంబంధించిన అసౌకర్యం కలగకుండా ప్రస్తుతం నిరాటంకంగా బస్సులు నడపబడుతున్నాయి అని తెలియజేయడానికి సంతోషిస్తూ భక్తులందరూ యథావిధిగా తమ తిరుమల యాత్ర కొనసాగించవచ్చునని తెలియజేస్తున్నాను.

భక్తుల సౌకర్యాలు, భక్తి ప్రచారమే మన ధ్యేయం అయినా ఆప్తులను, అభాగ్యులను ఆదుకొనే ధర్మార్థమైన కార్యక్రమాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానములు పెద్ద ఎత్తున చేపట్టిన విషయం మీకందరికీ తెలిసిందే. ఈ ధర్మార్థమైన కార్యక్రమాల వివరాలు ప్రసార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు వివరించుకుంటూ అమలులో సవరించుకొనుట ముదావహం. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పిజి కళాశాలలు, వికలాంగులు, మూగ చెవిటి పిల్లల కొరకు శ్రవణం ప్రాజెక్టుతోపాటు ప్రత్యేక పాఠశాలలు, ఈ జిల్లాలోని కొన్ని విశ్వవిద్యాలయాలకు ఇతోధికంగా ఆర్థికసహాయం చేస్తున్న విషయం అందరికీ విదితమే. అలాగే ఈ ప్రాంతవాసులకు మరియు యాత్రికుల వైద్య అవసరాలను తీర్చడానికి తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో స్విమ్స్‌, బర్డ్‌ లాంటి అనేక వైద్య సంస్థలను నిర్వహించడమే కాకుండా ప్రభుత్వ వైద్యశాలలకు కూడా ఆర్థికసహాయం చేయడం జరుగుతోంది.

– శ్రీవారి ఆలయం మరియు తితిదే నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహా మేరకు రాజీకి తావులేకుండా నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాను.
– భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇటీవలనే ప్రయోగాత్మకంగా గురువారం మినహా మిగతా రోజుల్లో రాత్రి విఐపి బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేయడమైనది. దీనివల్ల ఇంకొంత కాలం సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలు ఏర్పడింది.
– దేశ విదేశాల నుండి తిరుమలకు వస్తున్న భక్తులకు సంతృప్తికరమైన శ్రీవారి దర్శనం, బస, ప్రసాదాలు ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఉద్యోగులందరూ అంకితభావంతో పని చేస్తున్నారని మనవి చేసుకుంటున్నాను.
– శేషాచల కొండలలో నెలవైన తిరుమల పుణ్యక్షేత్రంలో పర్యావరణ పరిరక్షణ బాధ్యత మన అందరిపైనా ఉంది. ఇందుకోసం ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తున్నామని తెలియజేస్తున్నాను. దీని వలన భావితరాల వారికి కూడా మనం పొందుతున్న దివ్యానుభూతి ఈ పవిత్ర క్షేత్రంలో లభించాలన్నది మనందరి ఆశయంగా ఉండాలి.
– తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు స్వామివారి వైభవాన్ని, భారతీయ హైందవ సనాతన ధర్మాన్ని కళ్లకు కట్టే రీతిలో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటుచేసి తిరుమల, తిరుపతిలోని మ్యూజియంలను అభివృద్ధి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్ణయించింది. ఇందుకోసం నిపుణులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
– శ్రీవారి సేవ వ్యవస్థకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒక్క మే నెలలోనే ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుండి 355 బృందాల్లో మొత్తం 7,538 మంది శ్రీవారి సేవకులు తిరుమలలో భక్తులకు సేవలందించారు. వీరి విశిష్టసేవలను భవిష్యత్తులో ఉపయోగించుకుని భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి కృషి చేస్తున్నాము.
– త్వరలో శ్రీవారి సేవకులకు ప్రత్యేక వసతి సముదాయం నిర్మాణానికి  కూడా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాను.
– తితిదేలోని తిరుమల, తిరుచానూరు దేవాలయాలే కాకుండా ఇతర స్థానిక ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఈ ఆలయాలను సందర్శించే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను.
– హిందూ ధర్మప్రచార పరిషత్తు ద్వారా మనగుడి, శ్రీనివాస కల్యాణాలు లాంటి పలు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ హైందవ ధర్మ ప్రచారాన్ని ఇటు తితిదేలోని అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, పుస్తక ప్రచురణ విభాగం లాంటి  వివిధ ధార్మిక ప్రాజెక్టుల ద్వారా, అటు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌, ఇతర ప్రసార మాధ్యమాల సహకారంతో మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇంకా పటిష్టంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము. ఈ సంవత్సరంలో ఈ నెల 21న శ్రావణపౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగే మనగుడి కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని ధర్మప్రచారంలో భాగస్వాములై స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను.
– హిందూ ధర్మ ప్రచారానికి, యాత్రికులకు వసతి సముదాయాల నిర్మాణానికి, భద్రత కోసం, సిబ్బందికి శిక్షణ కోసం, దళిత, మత్స్యకారుల నివాస ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ సమాజంలో ధార్మికతను పెంపొందింప చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు అవిరళ కృషి సలుపుతోందని మనవి చేస్తున్నాను.
– భావి భారత పౌరులైన విద్యార్థులకు భారతీయ హైందవ సనాతన ధర్మ సంస్కృతి, సంప్రదాయ విలువలు నేర్పడంలో భాగంగా ”శుభప్రదం” పేరిట వేసవి శిక్షణ తరగతులను తితిదే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. తద్వారా యువతలో మానవీయ విలువలతో పాటు, సమాజంలో వారు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు తన వంతు కృషి చేస్తోందని తెలియజేస్తున్నాను.
– ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనంగా పేరుగాంచిన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, అలహాబాదు నగరంలోని కుంభమేళాలో 2013, జనవరి 27వ తేదీన శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటుచేసి 45 రోజుల పాటు వేలాది మంది భక్తులకు ముఖ్యంగా ఉత్తరాది భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా 5 డిగ్రీల చలిలో సైతం భక్తుల సేవలో అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులకు నా ప్రత్యేక అభినందనలు.
– భారతీయులకు గోవు ఇలవేల్పు. అందుకే ‘గోమాత’ అని పిలుచుకుంటాం. సకల దేవతలకు నెలవైన గోమాతలను మనం సంరక్షించు కోవాలనే ఉద్దేశంతో తితిదే  గోసంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించింది. ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రతి జిల్లాలో గోసంరక్షణ కొరకు దాతలు సహృదయతతో ముందుకు రావాల్సిందిగా  విజ్ఞప్తి చేస్తున్నాను.
– చార్‌ధామ్‌ యాత్రా స్థలాల్లో చిక్కుకున్న తీర్థ యాత్రికులను, బాధాతప్త హృదయులను ఆదుకునేందుకు ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రిషీకేశ్‌లోని ఆంధ్ర ఆశ్రమానికి అధికారులను పంపి ఉచిత బస, ఉచిత భోజన వసతులను తిరుమల తిరుపతి దేవస్థానములు కల్పించింది. ఆపద సమయంలో ఆదుకునేందుకు మేమున్నామంటూ వారికి ఆపన్నహస్తం అందించింది తిరుమల తిరుపతి దేవస్థానములు.
– ఉద్యోగుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వంలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు దేవస్థానంలో కూడా అమలుపరచడం జరుగుచున్నది. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నాము. అంతేకాకుండా ఉద్యోగుల సముచితమైన ఇతర కోర్కెల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మనవి చేస్తున్నాను.
– తితిదే నిర్వహణలో కావాల్సిన మార్గదర్శకత్వం చూపుతున్న గౌరవ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ గారికి, గౌరవ సభ్యులకు, రాష్ట్రస్థాయిలోని పెద్దలు, అధికారులకు, మఠాధిపతులు, పీఠాధిపతులకు నా కృతజ్ఞతా భివందనాలు తెలియజేస్తున్నాను.
– తిరుమలలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ భక్తుల సేవలో తరిస్తున్న దాదాపు 20 వేల మంది పైచిలుకు ప్రత్యక్ష, పరోక్ష సిబ్బందికి నా అభినందనలు. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థను క్రమశిక్షణతో, అత్యంత సామర్థ్యంతో నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి నా అభినందనలు. శ్రీవారి భక్తులకు భద్రతాపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన భద్రతను అందించడంలో నిర్విరామకృషి చేస్తున్న భద్రతా సిబ్బందికి నా అభినందనలు.
తిరుమల తిరుపతి దేవస్థానములు ఇటు భక్తిభావ ప్రచారానికి, అటు ధర్మార్థమైన కార్యక్రమాలకు నూతనోత్సాహంతో పునరంకితమవుతోందని ఈ శుభదినాన తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ….జైహింద్‌.
కాగా ఈ ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అలహాబాదులో జరిగిన కుంభమేళాలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయం వద్ద భక్తులకు విశిష్ట సేవలు అందించిన 11 మంది తితిదే అధికారులకు 5 గ్రాముల వెండి డాలర్‌, ప్రశంసాపత్రాన్ని ఈవో బహూకరించారు. అదేవిధంగా విధినిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన 138 మంది తితిదే ఉద్యోగులకు 5 గ్రాముల వెండి డాలర్‌, ప్రశంసాపత్రం, శ్రీవారి మెట్టు వద్ద సహాయ కార్యకలాపాలు చేపట్టిన నలుగురు సిబ్బందికి 5 గ్రాముల వెండి డాలర్‌ అందజేశారు. అలాగే తితిదే విద్యాసంస్థల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది విద్యార్థులకు 10 గ్రాముల వెండి డాలర్‌తో పాటు ప్రశంసాపత్రం, పదో తరగతితో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తితిదే ఉద్యోగుల పిల్లలు 125 మందికి రూ.1,116/- నగదు బహుమతితోపాటు ప్రశంసాపత్రం, ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన ఉద్యోగుల పిల్లలు 26 మందికి రూ.2,116/- నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం, రక్తదానం చేసిన 37 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను ఈవో చేతులమీదుగా ప్రదానం చేశారు.
            
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.