హనుమంత వాహనసేవలో ఆకట్టుకున్న తుళు నృత్యం, రింగ్ డ్యాన్స్, పిల్లనగ్రోవి భజన
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
హనుమంత వాహనసేవలో ఆకట్టుకున్న తుళు నృత్యం, రింగ్ డ్యాన్స్, పిల్లనగ్రోవి భజన
తిరుమల, 2018 అక్టోబరు 15: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం ఉదయం హనుమంత వాహనసేవలో కళాబృందాలు ప్రదర్శించిన తుళు నృత్యం, రింగ్ డ్యాన్స్, పిల్లనగ్రోవి భజన భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తుళు నృత్యం, పిల్లనగ్రోవి భజన బృందాలు ప్రదర్శనలిచ్చాయి. కర్ణాటక రాష్ట్రం తరికెరెకు చెందిన శ్రీ విజయప్రకాష్ ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస యువ భజనా మండలిలోని 30 మంది కళాకారులు తుళు నృత్యాన్ని ప్రదర్శించారు. కోస్టల్ కర్ణాటక ప్రాంతానికి పరిమితమైన జానపద కళారూపం తుళు నృత్యం. ఆ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు దీన్ని ప్రదర్శించేవారు. ఈ కళారూపాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ బృందంలోని కళాకారులు తెలిపారు. వీరు రామాయణం, మహాభారతంలోని ఘట్టాలను తీసుకుని ప్రదర్శన ఇస్తారు. ప్రస్తుతం హనుమంత సేవ ఘట్టాన్ని ప్రదర్శించారు. ఇందులో సీతారామలక్ష్మణులు, హనుమంతుని వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ బృందంలోని కళాకారుల్లో ఉద్యోగులు, విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువకులు ఉన్నారు.
చత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన వెంకటకృష్ణ బృందంలోని 20 మంది కళాకారులు పిల్లనగ్రోవి భజనను చక్కగా ప్రదర్శించారు. వీరందరూ వ్యవసాయదారులే. స్థానికంగా జరిగే పర్వదినాలు, ఉత్సవాల్లో వీరు భజన చేస్తుంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో సారి ప్రదర్శన ఇస్తున్నారు. ఇందులో 4 పిల్లనగ్రోవిలు, 12 జాగర్లు(తాళాలు), 2 చెక్క వాయిద్యాలతో పలు భక్తి పాటలకు భజన చేశారు. ఇందులో “శ్రీరామ రామ రామ….., ఆ కొండ ఈ కొండరా దేవుడా…., గొబ్బియలో….., శంకరాయ దేవ ఇనవేరా….” తదితర భక్తిపాటలను పిల్లనగ్రోవిలో చక్కగా పలికిస్తూ కాలిగజ్జెలతో అడుగులు వేస్తూ భజన చేశారు.
టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రింగ్ డ్యాన్స్ అలరించింది. పశ్చిమగోదావరి జిల్లా పురుషోత్తమ పట్నానికి చెందిన శ్రీమతి ఎం.రాజ్యలక్ష్మి నేతృత్వంలోని నమో వేంకటేశాయ భజన మండలికి చెందిన 41 మంది కళాకారులు ఈ ప్రదర్శన ఇచ్చారు. మధ్యలో శ్రీకృష్ణుడి ప్రతిమతో ఒకరు నిలబడి ఉండగా రింగులతో గోపికలు చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.