తిరుమలలోని జలాశయాల్లో పెరిగిన నీటిమట్టం

తిరుమలలోని జలాశయాల్లో పెరిగిన నీటిమట్టం

నవంబరు 15, తిరుమల, 2017: తిరుమలలోని జలశయాల్లో నీటిమట్టం పెరిగింది. తద్వారా భక్తులకు నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. తిరుమలలో వర్షాలు కురవాలని కోరుతూ ఆగస్టులో కారీరిష్టి యాగం

నిర్వహించిన విషయం విదితమే. శ్రీవారి ఆశీస్సులు, కారీరిష్టి యాగ ఫలితంగా ఇటీవల విస్తారంగా వర్షాలు కురిశాయి. తిరుమలలోని జలాశయాల్లో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 6,501 మిలియన్‌ లీటర్లు కాగా, ప్రస్తుతం 5,892 మిలియన్‌ లీటర్లు అనగా 90 శాతం నీరు నిల్వ ఉంది.

ప్రస్తుతం తిరుమలలో భక్తులకు సరాసరిన రోజుకు 14 మిలియన్‌ లీటర్ల నీరు అవసరమవుతోంది. తిరుమలలో గోగర్భం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార మరియు పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఈ జలాశయాల్లో డెడ్‌ స్టోరేజిని మినహాయిస్తే మొత్తం 6,294 మిలియన్‌ లీటర్లు నీరు నిల్వ ఉంది. తిరుపతిలోని కల్యాణి డ్యామ్‌లో 604 ఎంసిఎఫ్‌టి నీరు నిల్వ ఉంది. రోజుకు సరాసరి 14 ఎంఎల్‌డి నీటిని వినియోగించుకున్న పక్షంలో తిరుమలలోని డ్యామ్‌లలో 11 నెలలకు సరిపడా నీరు నిల్వ ఉంది. కల్యాణి డ్యామ్‌ నుంచి రోజుకు 8 ఎంఎల్‌డి నీటిని తీసుకుంటే 25 నెలల వరకు భక్తుల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

గోగర్భం డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 2,833 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 1,835 లక్షల గ్యాలన్ల(65 శాతం) నీరు నిల్వ ఉంది. పాపవినాశనం డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 5,240 లక్షల గ్యాలన్లు కాగా పూర్తిగా 100 శాతం నీరు నిల్వ ఉంది. ఆకాశగంగ డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 685 లక్షల గ్యాలన్లు కాగా, పూర్తిగా 100 శాతం నీరు నిల్వ ఉంది. కుమారధార మరియు పసుపుధార డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 5,546 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 5,205 లక్షల గ్యాలన్ల(94 శాతం) నీరు నిల్వ ఉంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.