SARVA SVATANTRA LAKSHMI BRAHMOTSAVAMS OFF TO A COLOURFUL START WITH GAJADHWAJAROHANAM_ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభం

Tiruchanur, 15 November 2017: The nine-day celestial Karthika Brahmotsavams of Goddess Padmavathi are off to a colourful start in Tiruchanoor on Wednesday with Gajadhwajarohana Mahotsavam.

After performing a series of rituals as per the tenets of Pancharatra Agama, the Dhwaja Patam bearing the image of Gaja Vahanam was hoisted on the temple pillar mast amidst chanting of Vedic hymns by Vedic pundits and archakas.

Later to appease and invoke the blessings of Goddess and other deities various ragas were rendered as per tradition including Mayamalavagowla, Gandhara, Kousika, Punnagavarali, Bhupalam, Sri Ragam, Devagandhari, Sourastra etc.

TTD EO Sri Anil Kumar Singhal, Tirupati JEO Sri Pola Bhaskar, CVSO Sri Ake Ravikrishna, Addl CVSO Sri Sivakumar Reddy, Spl Gr DyEO Sri Munirathnam Reddy and others took part.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభం

తిరుపతి, 2017 నవంబరు 15: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి హృదయేశ్వరియైన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి.తొమ్మిది రోజుల పాటు కన్నులపండుగగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా తొలిరోజు ఉదయం 9.50 గంటలకు ధనుర్‌ లగ్నంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ప్రధాన కంకణభట్టార్‌ శ్రీ మణికంఠ భట్టార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

గజపట ప్రతిష్ఠ :

ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించారు. ఇదే సమయంలో యాగశాలలో గజపట ప్రతిష్ఠ చేపట్టారు. గజ ప్రతిష్ఠలో భాగంగా గజధ్యాన శ్లోకం, గజ మంగళాష్టకం, గరుడ గద్యం వళ్లించి అపరాధ క్షమాపణం కోరారు. ఈ గరుడ గద్యం ప్రస్తావన కాశ్యప సంహితలో ఉంది. ఈ సందర్భంగా రక్షాబంధనం, ఛాయాధివాసం, ఛాయా స్నపనం, నేత్రోల్మీనలనం, తత్వన్యాస హోమం, ప్రాణప్రతిష్ట హోమం, పూర్ణాహుతి చేపట్టారు. ఆ తరువాత గజపటాన్ని ధ్వజారోహణ మంటపానికి తీసుకొచ్చారు.

సకలదేవతలకు ఆహ్వానం :

ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం నిర్వహించారు. నెయ్యి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచగవ్యం, పాలు, పెరుగు, తేనె, పసుపునీటిని తొమ్మిది కలశాల్లో ఉంచి పరవాసుదేవ, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర దేవతలను ఆవాహన చేశారు. ఆ తరువాత షోడషోపచారాలు నిర్వహించారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకం తరువాత బ్రహ్మూత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు.
రాగ, తాళ నివేదన :

రాగ స్వర తాళాలతో దేవతలను, పంచాయుధాలను, కుముదాది గణాలను ఆహ్వానించారు. కుబేరుడి కోసం శ్రీరాగం, పరమేశ్వరుడి కోసం శంకరాభరణం, గజరాజు కోసం మాళవగౌళ, బ్రహ్మ కోసం ఏకరంజని, వరుణుడి కోసం కానడ, వాయువు కోసం తక్కేసి రాగాలను మంగళవాయిద్యాలపై పలికించారు. అదేవిధంగా గాంధార రాగం, మురళీ రాగం, నాటభాగ రాగం, కల్యాణి రాగం – ఆదితాళం, భుజంగ రాగం – ధ్రువ తాళం, గరుడాఖ్యి రాగం, సావేరి రాగం – త్రిపుట తాళం, సుమంత రాగం – నాట తాళం, మధ్యమావతి రాగం – మధ్య తాళం, సౌరాష్ట్ర రాగం – రూపక తాళం, బేగడ రాగం – ఏక తాళం, రేగుప్త రాగం – శంబే తాళం, పంతువరాళి రాగం – మల్ల తాళం, సామంత రాగం, రామక్రియ రాగం – సింహళిక తాళం, కాంభోజి రాగం – సింహవిక్రమ తాళం, దేవగాంధార రాగం – శ్రీరంగ తాళం, కారీ రాగం – గజలీలా తాళం, వరాళి రాగం – చించత్పుర తాళం, అనంత తాళం, కౌషిక రాగం – ఘర్మ తాళం, ఘంటా రాగం – నృసింహ తాళం, భూపాల రాగం – సింహనాద తాళం ఆలపించారు. భూలోకం, సువర్ణ లోకం, పాతాళ లోకాల నుంచి దేవతలను ఆహ్వానించేందుకు గజపటం ఆరోహణం చేయడంతో
ధ్వజారోహణ పర్వం ఘనంగా ముగిసింది.

అనంతరం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు సకలదేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం అంగరంగ వైభవంగా నిర్వహించినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదం, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్‌ వసతులు కల్పించినట్టు తెలిపారు. అమ్మవారి వాహనసేవలలో భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

మహిళలకు పసుపు కుంకుమ, గాజులు పంపిణీ :

ధ్వజారోహణం సందర్భంగా టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ దంపతులు, డిపిపి కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డితో కలిసి సౌభాగ్యం కార్యక్రమంలో భాగంగా మహిళలకు పసుపు కుంకుమ, గాజులు, రవికె పంపిణీ చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ వీటిని అందించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు మహిళలను ఆహ్వానించేందుకు టిటిడి సౌభాగ్యం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ దంపతులు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ దంపతులు, సివిఎస్వో శ్రీ ఆకే రవికృష్ణ, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి ఉపకార్య నిర్వహణాధికారి శ్రీ మునిరత్నరెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ రాధాకృష్ణ, ఎవిఏస్వోలు శ్రీ పార్థసారథిరెడ్డి, శ్రీ గంగరాజు, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.