‘డయల్ యువర్ ఈవో’ ముఖ్యాంశాలు
‘డయల్ యువర్ ఈవో’ ముఖ్యాంశాలు
ఏప్రిల్ 06, తిరుమల 2018: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ముందుగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ భక్తులను ఉద్దేశించి ప్రగించారు. ఆ వివరాలు.
ఏప్రిల్ 24 నుండి 26వ తేది వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు : ఈ నెల 24వ తేది నుండి తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం.
శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో మహాసంప్రొక్షణ : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ ఏప్రిల్ 8 నుండి 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తాం. ఏప్రిల్ 12వ తేదీ నుండి భక్తులకు స్వామివారి మూలమూర్తి దర్శనం కల్పిస్తాం.
తిరుమలలో వేసవి ఏర్పాట్లు : వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. క్యూలైన్లలో వేచిఉండే భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సౌకర్యాలను క్రమం తప్పకుండా అందిస్తున్నాం. భక్తుల రద్దీ నేపథ్యంలో వారికి సేవలందించేందుకు దాదాపు 2500 మందికి పైగా శ్రీవారి సేవకులు, స్కౌట్స్ మరియు గైడ్స్ సేవలను వినియోగిస్తాం.
ప్రత్యేక దర్శనాలు : వృద్ధులు, దివ్యాంగులు, 5 ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రతినెలా 2 రోజుల పాటు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా ఏప్రిల్ 10, 24వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు, ఏప్రిల్ 11, 25వ తేదీల్లో 5 ఏళ్ల లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తాం. ఈ అవకాశాన్ని వృద్ధులు, దివ్యాంగులు, 5 ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
శ్రీవారి సేవకు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత నమోదుకు అవకాశం : తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు ఉద్దేశించిన శ్రీవారిసేవకు మార్చి 30వ తేది నుంచి ఆన్‌లైన్‌లో వ్యక్తిగతంగా నమోదు చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పించింది. ఈ అవకాశాన్ని శ్రీవారిసేవకులు సద్వినియోగం చేసుకుని సేవలందించాలన్నారు. త్వరలో శ్రీవారి సేవకులు టిటిడిలోని వివిధ విభాగాలలో సేవలందించేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో కొత్త అప్లికేషన్‌ను తీసుకువస్తున్నాం. ఈ విధానం ద్వారా శ్రీవారి సేవకులు తమకు నచ్చిన విభాగాలలో తమ పేర్లను నమోదు చేసుకుని సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ టిటిడికి చెందిన రూ.4 వేల కోట్లను ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పారదర్శకంగా బ్యాంక్‌లలో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ నూచనలను అనుసరించి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల జాబితా ప్రకారం వచ్చిన సీల్డ్ బిడ్ కొటేషన్లను మార్చి 24వ తేది పరిశీలించామన్నారు. వచ్చిన కొటేషన్లను పరిశీలించి మరింత మెరుగైన వడ్డీ రేట్లను కోరుతూ మార్చి 26వ తేదీన మరోసారి బ్యాంకుల నుండి సీల్డ్ బిడ్ కొటేషన్లను ఆహ్వానించినట్టు తెలియజేశారు. ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ సూచనల ప్రకారం రూ.3 వేల కోట్లను ప్రభుత్వరంగ బ్యాంకులలోనూ, రూ.1000 కోట్లను ప్రైవేట్ బ్యాంక్‌లలో డిపాజిట్ చేయాల్సి ఉందన్నారు. అందులోభాగంగా విజయా బ్యాంక్ 7.27 శాతం, సిండికేట్ బ్యాంక్ 7.11 శాతం, ఆంధ్రా బ్యాంక్ 7.32 శాతం వడ్డీ ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలిపారు. వీటిలో అధిక వడ్డీని ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఆంధ్రా బ్యాంక్‌లో రూ.3,000 కోట్లు (7.32 శాతం వడ్డ్డీకి), ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో రూ.1,000 కోట్లను (7.66 శాతం వడ్డీకి) డిపాజిట్ చేశామన్నారు.
సర్వదర్శనం భక్తుల కోసం తిరుపతి, తిరుమలలో టైంస్లాట్ కౌంటర్లను త్వరలో ప్రారంభిస్తామని ఈవో తెలిపారు. ఆధార్‌తోపాటు మరో గుర్తింపుకార్డును పరిగణనలోకి తీసుకోవాలని యోచిస్తున్నామని, ఐరిష్ విధానంలో సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నామని వివరించారు. టిటిడి పరిధిలో 290 కల్యాణమండపాలు ఉన్నాయని, వీటిలో భక్తుల ఆదరణ ఉన్న 120 కల్యాణమండపాలను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టామని తెలియజేశారు. వేసవిలో విద్యార్థులు సంస్కృతం నేర్చుకునేందుకు వీలుగా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం సహకారంతో ఎస్వీబీసీలో 90 ఎపిసోడ్లతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్, సివిఎస్వో శ్రీ ఆకె రవికృష్ణ, ఎస్వీబీసీ ఇన్‌చార్జి సిఈవో శ్రీ ఎన్.ముక్తేశ్వరరావు, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.