భక్తుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్న టిటిడి ఈవో
రథసప్తమికి విశేషంగా తరలివచ్చిన భక్తులు
సంతృప్తికరంగా వాహనసేవల దర్శనం
గ్యాలరీల్లో షెడ్ల ఏర్పాటుపై సంతోషం
భక్తుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్న టిటిడి ఈవో
తిరుమల, 12 ఫిబ్రవరి 2019: సూర్యజయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోకి గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు.
చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందుల్లేకుండా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. తూర్పు మాడ వీధిలో భక్తులు కూర్చునేందుకు జర్మన్ షెడ్లు కూడా ఏర్పాటుచేశారు. శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేశారు. మాడవీధుల్లో 365 మరుగుదొడ్లు, 168 మూత్ర విసర్జనశాలలను భక్తులకు అందుబాటులో ఉంచారు. వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా 20 ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్య కూడళ్లలో శోభాయమానంగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 164 మంది టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, 600 మంది పోలీసులు, 85 మంది ఎస్‌పిఎఫ్ సిబ్బంది, 100 మంది ఎన్‌సిసి క్యాడెట్లు సేవలను వినియోగించుకున్నారు. 3,500 మంది శ్రీవారి సేవకులు, 900 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవలను ప్రత్యక్షప్రసారం చేశారు.
సౌకర్యాలను భక్తులను అడిగి తెలుసుకున్న టిటిడి ఈవో
వాహనసేవలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు గ్యాలరీల్లో కల్పించిన సౌకర్యాలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. టిటిడి సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నప్రసాదాలు బాగున్నాయని, ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు బాగుతుందని ధన్యవాదాలు తెలియజేశారు.
వాహనసేవల్లో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో శ్రీఅనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీ ఇ.పెద్దిరెడ్డి, శ్రీపి.రమేష్‌బాబు, శ్రీ ఎన్.శ్రీకృష్ణ, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.