EO, TIRUMALA JEO MONITORS THE TTD ARRANGEMENTS TO PILGRIMS _ రైల్వేస్టేషన్, అలిపిరి వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ చేసిన తిరుమల జెఈవో
రైల్వేస్టేషన్, అలిపిరి వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ చేసిన తిరుమల జెఈవో
తిరుపతి, ఆగస్టు 28, 2013: సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో తిరుపతిలోని పలు ఫలహారశాలలు, భోజనశాలలను మూసివేయడంతో తిరుమలకు వచ్చే భక్తులకు భోజనం, రవాణా విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా తితిదే బుధవారం విస్తృత ఏర్పాట్లు చేసింది. రైల్వే స్టేషన్, అలిపిరి లింక్ బస్టాండ్‌లో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
అలిపిరి వద్ద కాలిబాట భక్తులతో పాటు, ఇతరులకు ఉప్మా, సాంబారు అన్నం, పెరుగన్నం, పాలు, మజ్జిగ వంటి ఆహారపదార్థాలను అందుబాటులో ఉంచి పంపిణీ చేశారు. కొందరు భక్తులకు జెఈవో స్వయంగా అన్నప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా తిరుపతి రైల్వేస్టేషన్ నుండి అలిపిరి వరకు తితిదే ఉచిత బస్సులు నడిపింది. జెఈవో సంబంధిత రవాణా విభాగం అధికారులతో నిరంతరం సంభాషిస్తూ వారిని అప్రమత్తం చేసి భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకున్నారు.
ఉదయం 4.00 గంటల నుండి సాయంత్రం వరకు తితిదేకి చెందిన 16 బస్సులు తిరుపతి రైల్వే స్టేషన్ – అలిపిరి మధ్య 500 ట్రిప్పులు తిరిగాయి. 35 వేల మంది భక్తులను రైల్వేస్టేషన్ నుండి అలిపిరికి తరలించాయి. తిరుపతి రైల్వే స్టేషన్, అలిపిరి వద్ద ఉదయం నుండి 16 వేల మంది భక్తులకు పాలు, 45 వేల మంది భక్తులకు అన్నప్రసాదం(సాంబారన్నం, పెరుగన్నం) తితిదే అధికారులు పంపిణీ చేశారు. తితిదే విజిలెన్స్ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్‌టిసి బస్టాండు, శ్రీనివాసం, లీలామహల్ జంక్షన్, నంది సర్కిల్, అలిపిరి బస్టాండు వద్ద తితిదే విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూశారు.
ఈ మొత్తం ఏర్పాట్లను తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, విజిఓ శ్రీ హనుమంతు, ట్రాన్స్‌పోర్టు జనరల్ మేనేజర్ శ్రీ శేషారెడ్డి, అన్నదానం డెప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్, క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీ దేశాయ్‌రెడ్డి, హెల్త్ యూనిట్ ఆఫీసర్ శ్రీ సుబ్రమణ్యం, ఎవిఎస్‌ఓలు, డ్యూటీ ఇన్‌స్ట్రక్టర్లు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.