TEPPOTSAVAMS IN TIRUCHANOOR FROM JUNE 23 TO 27_ జూన్‌ 23 నుండి 27వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు

Tiruchanoor, 21 June 2018: The annual Teppotsavams in Tiruchanoor will be observed from June 23 to 27.

Padmasarovaram, the temple tank, has geared up to host the float festival of Goddess Padmavathi Devi.

This five day fete commences on Daani and concludes on Pournami day.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 23 నుండి 27వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుపతి, 2018 జూన్‌ 21: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్‌ 23 నుండి 27వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ ఉత్సవాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి పట్టపురాణి అయిన అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షసుఖం సిద్ధిస్తుంది. పద్మసరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తుందని ఈ తెప్పోత్సవాల అంతరార్థం.

జూన్‌ 23వ తేదీ మొదటి రోజు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీసుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీపద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.

అమ్మవారికి జూన్‌ 26వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహనం, 27వ తేదీ రాత్రి 8.45 నుండి 10.00 గంటల వరకు గరుడ వాహనసేవలు వైభవంగా జరుగనున్నాయి. తెప్పోత్సవాల అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆర్జితసేవలు రద్దు :

తెప్పోత్సవాల కారణంగా జూన్‌ 23 నుండి 27వ తేదీ వరకు అమ్మవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు. అదేవిధంగా జూన్‌ 25న అష్టోత్తర శతకలశాభిషేకం, జూన్‌ 27న లక్ష్మీపూజ వారపుసేవలు రద్దు కానున్నాయి.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.