తెప్పలపై శ్రీ సోమస్కందస్వామివారి అభయం
తెప్పలపై శ్రీ సోమస్కందస్వామివారి అభయం
తిరుపతి, 2018 డిసెంబరు 20: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో మూడోరోజైన గురువారం సాయంత్రం శ్రీ సోమస్కందస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు స్వామివారు ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు.
అదేవిధంగా శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారు తెప్పలపై ఏడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మురళీకృష్ణ, శ్రీ రెడ్డిశేఖర్ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
డిసెంబరు 23న ఆరుద్ర దర్శన మహోత్సవం
డిసెంబరు 23వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 5.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసగ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.