JEO INSPECTS QUEUE LINES IN TIRUMALA _ భక్తజనసంద్రమైన తిరుమల – ఏర్పాట్లను పరిశీలించిన జె.ఇ.ఓ
భక్తజనసంద్రమైన తిరుమల – ఏర్పాట్లను పరిశీలించిన జె.ఇ.ఓ
వరుస సెలవులు కారణంగా తిరుమల పుణ్యక్షేత్రం భక్తజనసంద్రమైంది. ప్రత్యేకించి వారాంతం కావడంతో తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ముఖ్యంగా కాలినడక యాత్రికుల సంఖ్య సాధారాణ రోజులకన్నా ద్విగుణీకృతమైంది.
తిరుమలకు వెళ్ళే అలిపిరి కాలిబాట మరియు శ్రీవారిమెట్టు కాలిబాటల్లో యాత్రికుల సంఖ్య సాధారణ రోజుల్లో 6000 నుండి 10,000 నడుమ ఉండగా వారాంతపు సెలవు దినాల్లో దాదాపు 15,000 కు చేరుకుంటుంది. అటువంటిది శనివారంనాడు ఈ సంఖ్య 30,000 కు పైగా కావడంతో తిరుమలలో అన్ని మార్గాలు జనసంద్రమైయ్యాయి.
ఏర్పాట్లను పరిశీలించిన జె.ఇ.ఓ ః-
శనివారంనాడు తిరుమలలో అనూహ్యస్థాయిలో పెరిగిన రద్దీ దృష్ట్యా భక్తుల కొరకు తి.తి.దే చేసిన అన్నప్రసాద వితరణ, త్రాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయ ఏర్పాట్లను తి.తి.దే తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు ప్రత్యక్షంగా పరిశీలించారు. కాలిబాట యాత్రికులు విపరీతంగా పెరిగిపోవడంతో నారాయణగిరి ఉద్యానవనాల్లో అప్పటికప్పుడు కృత్రిమ క్యూలైన్లు ఏర్పాటుచేసి భక్తులను క్రమబద్ధీకరించారు.
ఈ సందర్భంగా జె.ఇ.ఓ మీడియాతో మాట్లాడుతూ వరుస సెలవుల కారణంగా అనూహ్యంగా తిరుమలకు భక్తుల రద్దీ పెరిగిందన్నారు. ఈ కారణంగా ఆదివారంనాడు వి.ఐ.పి బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా మరో 10 నుండి 15 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించే అవకాశం ఉంటుందన్నారు. కాగా సర్వదర్శనానికి 33 గంటలు, కాలిబాట దర్శనానికి 19 గంటలు, రూ.300/- దర్శనానికి 4 నుండి 5 గంటల సమయం పడుతున్నదన్నారు. తిరుమలలో దాదాపు అన్ని వసతి గృహాలు భక్తులకు కేటాయించడమైనదన్నారు. ఈ కారణంగా వసతి గృహాల కొరత కూడా తిరుమలలో చోటుచేసుకున్నదన్నారు. భక్తులు కూడా తి.తి.దేకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.